దుబాయ్: మహిళల ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న భారత్ హ్యాట్రిక్‌పై గురి పెట్టింది టోర్నీకే హైలైట్‌గా నిలిచే మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. శనివారం రాత్రి జరిగే గ్రూప్-ఏ చివరి లీగ్ పోరులో దాయాదిని పడగొట్టి అజేయంగా సెమీఫైనల్‌కు రెడీ కావాలని హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని టీమిండియా భావిస్తోంది. మల్టీ నేషన్ టోర్నీల్లో ఇండో-పాక్ మ్యాచ్‌లకు ఎంత హైప్ ఉన్నా మైదానంలో మాత్రం భారత్ ప్రతీసారి ఏకపక్ష విజయాలు సాధిస్తోంది. ఈసారి కూడా హర్మన్సేననే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. హాంకాంగ్‌పై మెరుపు సెంచరీతో చెలరేగిన మంధాన ప్రత్యర్థి బౌలర్లకు గట్టి హెచ్చరికలు పంపింది.
దుబాయ్ పిచ్‌పై ఇన్నింగ్స్ ఆరంభంలో క్రీజులో నిలదొక్కుకోవడానికి సమయం తీసుకుంటున్న ఓపెనర్లు, ఆ తర్వాత బౌండరీలతో విరుచుకుపడుతున్నారు. అయితే మిడిలార్డర్లో ప్రతీకా రావల్, కెప్టెన్ హర్మన్, రిచా ఘోష్ పెద్దగా రాణించలేకపోతున్నారు. కీలకమైన సెమీస్‌కు ముందు ఈ ముగ్గురూ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వన్డేల్లో సత్తా చాటినప్పటికీ టీ20 ఫార్మాట్‌కు తగ్గట్లు వేగంగా ఆడలేకపోతున్న వన్‌డౌన్ బ్యాటర్ ప్రతీకపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు పేస్ బౌలింగ్‌లో క్రాంతి గౌడ్‌తో కలిసి కొత్త బంతితో నందని శర్మ ఆకట్టుకుంటోంది.
తమ ఆరంభ పోరులో థాయ్‌లాండ్‌పై సాధించిన విజయంతో పాకిస్థాన్ కూడా సెమీస్ రేసులో నిలిచింది. అయితే ఆ జట్టు బ్యాటింగ్ విభాగం తీవ్రంగా నిరాశపరుస్తోంది. థాయ్‌పై పవర్‌ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి మొత్తంగా 119 పరుగులకే పరిమితమైన పాక్బౌలర్ల ప్రతిభతో ఆ చిన్న లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఓపెనర్ మునీబా అలీ, ఆల్‌రౌండర్ కెప్టెన్ ఫాతిమా సనాపైనే ఆ జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. బలమైన టీమిండియాను ఢీకొట్టాలంటే పాకిస్థాన్ బ్యాటర్లు తమ ఆటతీరును గణనీయంగా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది.