రాజ్‌కోట్: విజయ్ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ యువ బ్యాటర్ పేరాల అమన్‌రావు దుమ్మురేపాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆడుతున్నది మూడో మ్యాచ్ అయినా ప్రత్యర్థి బౌలర్ ఎవరన్నది లెక్కచేయకుండా అజేయ ద్విశతకంతో కదంతొక్కాడు. మంగళవారం బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడి క్వార్టర్స్ అవకాశాలను క్లిష్టం చేసుకున్న హైదరాబాద్‌కు అమన్ అద్భుత విజయం అందించాడు. ఈ మధ్య జరిగిన ఐపీఎల్ వేలంలో 30 లక్షలకు రాజస్థాన్ రాయల్స్..అమన్‌రావును తమ జట్టులోకి తీసుకుంది. ఆది నుంచే దూకుడుగా ఆడే అలవాటు ఉన్న ఈ కరీంనగర్ కుర్రాడు..బెంగాల్‌తో పోరులోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలుత అమన్(154 బంతుల్లో 200 నాటౌట్, 12ఫోర్లు, 13సిక్స్‌లు) సూపర్ డబుల్ సెంచరీతో హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 352/5 స్కోరు చేసింది.
అమన్‌కు తోడు ఓపెనర్ రాహుల్‌సింగ్(65) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. షమీ(3/70)కి మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బెంగాల్..మహమ్మద్ సిరాజ్(4/58) ధాటికి 44.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. షాబాజ్ అహ్మద్(108 నాటౌట్) ఒంటరి పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. సిరాజ్ విజృంభణతో బెంగాల్ టాపార్డర్ కుప్పకూలింది. ఈ విజయంతో ఆరు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించిన హైదరాబాద్ ప్రస్తుతం 8 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నది. అజేయ ద్విశతకంతో మెరిసిన అమన్‌రావుకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. హైదరాబాద్ తమ చివరి మ్యాచ్‌లో జమ్మూకశ్మీర్‌తో ఆడుతుంది.
హైదరాబాద్ యువ సంచలనం అమన్‌రావు అదరగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో వీరవిహారం చేసిన ఈ కరీంనగర్ కుర్రాడు..అదే జోరును విజయ్ హజారే టోర్నీలోనూ కొనసాగిస్తున్నాడు. పిచ్‌పై బంతి పడటమే ఆలస్యం దాని గమ్యం బౌండరీ అన్న తీరుగా చెలరేగాడు. బెంగాల్‌తో కీలక పోరులో అమన్ సాగించిన పరుగుల విధ్వంసం మాటల కందనిది. రాహుల్‌సింగ్‌తో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ యువకుడు తొలి బంతి నుంచే బెంగాల్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. టీమ్ఇండియాకు కీలకంగా వ్యవహరించిన సీనియర్ స్పీడ్‌స్టర్ మహమ్మద్ షమీకి తోడు ఆకాశ్‌దీప్‌సింగ్(0/78), ముకేశ్‌కుమార్(0/55) అమన్ ధాటికి ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు.
బౌలర్ ఎవరన్నది లెక్కలోకి తీసుకోకుండా అమన్ తన ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 13 భారీ సిక్స్‌లతో చెలరేగాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు రాహుల్‌తో కలిసి 104 పరుగుల సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో అలరిస్తూ జట్టుకు భారీ స్కోరుకు బాటలు వేశాడు. మంచి ఫామ్‌మీదున్న కెప్టెన్ తిలక్‌వర్మ(34)తో కలిసి రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించాడు. సహచరులు ఇలా వచ్చి అలా వెళుతున్నా..ఓపెనర్‌గా వచ్చిన అమన్ కడదాకా క్రీజుకు పరిమితమై జట్టుకు 350 స్కోరు అందించాడు. 194 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్స్‌గా మలిచి కెరీర్లో తొలి డబుల్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు.
భారీ లక్ష్యఛేదనలో బెంగాల్‌ను సిరాజ్ ఆదిలోనే కోలుకోలేని దెబ్బతీశాడు. కివీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో బెంగాల్ బ్యాటర్లకు చుక్కలు చూపెట్టాడు. సిరాజ్ ధాటికి సుమిత్ నాగ్(10), కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(15), సుదీప్‌కుమార్(0), రోహిత్‌కుమార్(1) స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. సిరాజ్ చెలరేగడంతో బెంగాల్ 73 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఇక్కణ్నుంచి బెంగాల్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.
మిడిలార్డర్లో షాబాజ్ సెంచరీ పోరాటం జట్టును గెలుపు తీరాలకు చేర్చలేకపోయింది. మరోవైపు జమ్మూకశ్మీర్‌పై బరోడా 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. విష్ణు సోలంకి (132), ప్రియాంశు మోలియా (114) సెంచరీలతో బరోడా 50 ఓవర్లలో 332 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో జమ్మూకశ్మీర్ 45.3 ఓవర్లలో 256 పరుగులకు కుప్పకూలింది.
హిమాచల్‌ప్రదేశ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ముంబై 7 పరుగుల తేడాతో గెలిచింది. మొదట కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(82), ముషీర్‌ఖాన్(73) అర్ధసెంచరీలతో ముంబై 299/9 స్కోరు చేసింది. వైభవ్, అభిషేక్, కుశాల్ మూడేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత ఛేదనలో హిమాచల్ ప్రదేశ్ 32.4 ఓవర్లలో 292 స్కోరుకు ఆలౌటైంది. శివమ్ దూబే (4/68) రాణించాడు. పక్రజ్మన్ (64), మయాంక్(64)అర్ధసెంచరీలు చేశారు.