హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 3వ తేదీన జరుగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వేదిక మారింది. షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య జరిగే చివరి పోరుకు హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియం ఆతిథ్యమివ్వాల్సింది. అయితే అదే రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేయలేమని రాచకొండ పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి హెచ్‌సీఏ తీసుకెళ్లింది. ఈ క్రమంలో మ్యాచ్ వేదికను బెంగళూరుకు మారుస్తున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. దీంతో హైదరాబాద్‌లో భారత్ మ్యాచ్ చూడాలనుకున్న క్రికెట్ అభిమానులకు మరోమారు నిరాశ ఎదురైంది. ఇదిలా ఉంటే జనవరిలో అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌ను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మార్చే అవకాశముంది.