హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీ20 లీగ్ తొలి సీజన్ లో రంగారెడ్డి రైజర్స్ జట్టు.. రంజీ క్రికెటర్ తనయ్ త్యాగరాజన్ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఉప్పల్ స్టేడియంలో జరిగే మెగా లీగ్ కోసం బలమైన జట్టును సిద్ధం చేసుకుంది. తనయ్ త్యాగరాజన్‌ను కెప్టెన్‌ను ఎంపిక చేసినట్టు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆ ఫ్రాంచైజీ యజమానులు బి. రవికుమార్, సాయి సువీర్ రెడ్డి తెలిపారు. జట్టు లోగోను కూడా ఆవిష్కరించారు.
నితిన్ సాయి యాదవ్ వైస్ కెప్టెన్సీ చేపట్టనుండగా.. హెడ్ కోచ్‌గా అభినవ్ కుమార్, మెంటార్‌గా తిలక్ వర్మను తీర్చిదిద్దిన కోచ్ సలామ్ భయాష్ వ్యవహరిస్తారని ఫ్రాంచైజీ తెలిపింది. సీనియర్లు, యువ ఆటగాళ్లతో తమ జట్టు బలంగా ఉందని కెప్టెన్ తనయ్ ఈ సందర్భంగా తెలిపాడు. కొన్ని రోజులుగా ముమ్మర ప్రాక్టీస్‌తో పాటు ఇంట్రా స్కాడ్ మ్యాచ్‌లు ఆడుతూ టీమ్ బాండింగ్ పెంచుకుంటున్నామని తెలిపాడు. లీగ్‌లో నిర్భయంగా ఆడి జట్టుకు మంచి పేరు తెస్తామని చెప్పాడు.