హైదరాబాద్, ఆట ప్రతినిధి : క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించేందుకు పక్కా ప్రణాళికను ఎంచుకుంది. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో ఆయా జిల్లా క్రీడా అధికారుల (డీవైఎస్వో)తో క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులకు మంత్రి కీలక సూచనలు చేశారు.
క్రీడలను అందరికీ చేరువ చేసేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్, మ్యాగజైన్, యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేయబోతున్నారు. దీని ద్వారా ఏడాది పాటు జరిగే టోర్నీల షెడ్యూల్, పలువురు స్టార్ ప్లేయర్ల సమాచారం అందుబాటులో ఉండనుంది. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భవిష్యత్‌లో రాష్ట్రం నుంచి మరింత ప్లేయర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా తీర్చిదిద్దాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. ఇందుకోసం గ్రామీణ క్రీడా ప్రాంగణాలతో పాటు ప్రతీ నియోజకవర్గంలో మైదానాలను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లను విజయవంతం చేయాలని అన్నారు.
ఇందుకోసం స్థానికంగా ఉన్న ఎన్జీవోలు, కార్పొరేట్ కంపెనీలను భాగస్వామ్యం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు సీఎం కప్ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో టోర్నీలను ఏర్పాటు చేసి ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించనున్నారు. సీఎం కప్ నిర్వహణపై త్వరలో ఉద్యోగ సంఘాలు, క్రీడా సంఘాలతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేసేలా అందుకు తగిన కార్యచరణ రూపొందించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ సమావేశంలో సాట్స్ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాలకు చెందిన డీవైఎస్‌వోలు పాల్గొన్నారు.