భూపాలపల్లి రూరల్, మార్చి 29: కాంబోడియా వేదికగా జరిగిన ఏషియన్ పారాలింపిక్ త్రోబాల్ టోర్నీలో తెలంగాణకు చెందిన కావేరి జ్యోతి మెరిసింది. ఈ టోర్నీలో ఆతిథ్య కాంబోడియాకు స్వర్ణం, థాయ్‌లాండ్‌కు రజతం దక్కగా, భారత్ కాంస్యం ఖాతాలో వేసుకుంది. భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రానికి చెందిన నిరుపేద దళిత దివ్యాంగురాలు జ్యోతి భారత్ తరఫున బరిలోకి దిగి అద్భుత ప్రదర్శన కనబరిచింది.
టోర్నీలో పోటీపడి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన జ్యోతిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్‌లో జ్యోతి మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. టోర్నీకి ముందు జ్యోతి దీనస్థితి గురించి తెలుసుకున్న మంత్రి శ్రీధర్‌బాబు..కాంబోడియా వెళ్లేందుకు అయ్యే ప్రయాణ, వసతి, శిక్షణ ఖర్చులను ప్రభుత్వం ద్వారా సమకూర్చారు. దేశం గర్వపడేలా రాణించిన జ్యోతి ప్రదర్శన పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.