మోర్తాడ్, జనవరి 17: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఎస్జీఎఫ్ అండర్-17 రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ గురువారం ప్రారంభమయ్యాయి. టోర్నీని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘చదువుతో పాటు క్రీడలకు పెద్దపీట వేయాలి. క్రీడల వల్ల శారీరక, మానసిక ధృడత్వం ఏర్పడుతుంది. పోటీల్లో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలి. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా బాల్కొండలో మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో మినీ స్టేడియాలు నిర్మించుకున్నాం’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి సర్పంచ్ హారిక అశోక్, సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి శోభన్, నాగమణి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. తొలి రోజు పోటీల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన బాలికల, బాలర జట్లు సత్తా చాటాయి. బాలుర విభాగంలో నిజామాబాద్ 6-0 తేడాతో ఆదిలాబాద్‌పై విజయం సాధించింది. ఆదిలాబాద్ 8-0తో రంగారెడ్డిపై , వరంగల్ 10-0తో మహబూబ్‌నగర్‌పై మెదక్ 3-1తోకరీంనగర్పై గెలిచాయి. బాలికల విభాగంలో నిజామాబాద్ 6-1తేడాతో వరంగల్‌పై, ఆదిలాబాద్ 9-1తేడాతో నల్గొండపై, మెదక్ 6-0తో మహబూబ్‌నగర్‌పై గెలిచాయి. నిజామాబాద్-మెదక్, మహబూబ్‌నగర్- ఆదిలాబాద్ సెమీస్‌కు చేరుకున్నాయి.