ముంబై: భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ బెర్తులను ఖాయం చేసుకోగా ఆఖరి బెర్తు ఎవరిదా? అన్నదానిపై ఆసక్తి నెలకొంది. సెమీస్ రేసులో భారత్, న్యూజిలాండ్, శ్రీలంక నిలిచాయి. లీగ్ దశలో మరో ఆరు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్న ఈ టోర్నీలో సెమీస్ చేరుకోబోయే నాలుగో జట్టు ఏదనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సెమీస్ చేరాలంటే ఏయే జట్టుకు అవకాశాలెలా ఉన్నాయో చూద్దాం.
భారత్ అవకాశాలిలా..
టోర్నీలో రెండు మ్యాచ్‌లు గెలిచి తర్వాత మూడు మ్యాచ్‌లలోనూ గెలుపు అంచుల దాకా వచ్చి హ్యాట్రిక్ ఓటములకు గురైన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఆడిన ఐదు మ్యాచ్‌లలో రెండు గెలిచి నాలుగు పాయింట్ల (నెట్ రన్ రేట్ 0.526)తో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న టీమ్ండియాకు తర్వాత ఆడనున్న రెండు మ్యాచ్‌లు కీలకం. ఈ రెండూ గెలిస్తే ఇతర లెక్కలతో సంబంధం లేకుండా 8 పాయింట్లతో భారత్ సెమీస్‌కు అర్హత సాధింస్తుంది.
ఒకవేళ కివీస్‌తో మ్యాచ్ ఓడినా ఉమెన్ ఇన్ బ్లూకు నాకౌట్ దశకు చేరే అవకాశముంది. కివీస్ తమ ఆఖరి మ్యాచ్ (ఇంగ్లండ్‌తో)లో ఓడిపోయి భారత్.. బంగ్లాదేశ్‌తో పోరులో భారీ తేడాతో గెలుపొందితే మన అమ్మాయిలు సెమీస్ చేరుతారు. ఇక కౌర్ సేన ఆడబోయే రెండు మ్యాచ్‌లూ వర్షం వల్ల రైద్దెతే సమీకరణాలు మరింత సంక్లిష్టంగా మారుతాయి. అప్పుడు ఇంగ్లండ్.. కివీస్‌ను ఓడించాల్సి ఉంటుంది. శ్రీలంక గనక తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడిస్తే ఆ జట్టుకు ఆరు పాయింట్లు చేరతాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకమవనుంది.
కివీస్ ఆశలు..
మరోవైపు ఐదు మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే గెలిచి 4 పాయింట్లతో (నె.ర.రే. -0.245) ఐదో స్థానంలో ఉన్న కివీస్‌కూ సెమీస్ అవకాశాలు మెండుగానే ఉన్నాయి. తమ తదుపరి మ్యాచ్‌లో ఆ జట్టు భారత్‌ను ఓడించి.. ఇంగ్లండ్‌తో ఓడినా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లా టీమ్ఇండియాకు షాకిస్తే కివీస్ సెమీస్‌కు వెళ్తుంది. ఒకవేళ భారత్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రైద్దెతే ఇంగ్లండ్‌పై గెలిచినా ఆ జట్టు లాస్ట్-4కు చేరుతుంది. ఈ నేపథ్యంలో గురువారం (అక్టోబర్ 23న) భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగబోయే మ్యాచ్ సెమీస్‌కు ఎవరు చేరుతారా? అని నిర్ణయించేదే.
శ్రీలంక అధికారికంగా రేసులో లేకపోయినా ఆ జట్టుకు అవకాశాల్లేకపోలేదు. కానీ ఆ జట్టు సెమీస్ చేరాలంటే అద్భుతాలు జరగాలి. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు పాక్‌పై గెలవడమే గాక భారత్ ఆడే రెండు మ్యాచ్‌ల్లో ఓడాలి. అంతేగాక ఇంగ్లండ్.. న్యూజిలాండ్‌ను ఓడించాలి. టోర్నీలో ఒక్క విజయమూ లేని పాక్ అధికారికంగా నిష్క్రమించకపోయినప్పటికీ ఆడిన ఆరింట్లో నాలుగు ఓడిన ఆ జట్టుకు సెమీస్ అవకాశాలైతే లేవు.