జైపూర్: అనుకున్నదే జరిగింది! ఐపీఎల్-19 ప్రారంభానికి కొద్దిరోజుల ముందే ఈ లీగ్ తొలి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్‌తో పాటు 18వ సీజన్లో కప్పు కొట్టిన డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల అమ్మకం ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఈ ఫ్రాంచైజీలను అమ్మేయనున్నారని గడిచిన ఆరునెలలుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ రాజస్థాన్, బెంగళూరు జట్లు ఐపీఎల్ చరిత్రలోనే భారీ ధరకు అమ్ముడుపోయాయి. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్ సోమానీతో పాటు వాల్‌మార్ట్ ఫ్యామిలీ (రాబ్ వాల్టన్), హ్యాంప్ ఫ్యామిలీ రాయల్స్‌ను 1.63 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 15,300 కోట్లు)కు దక్కించుకున్నట్టు సమాచారం. ఈ వార్త వెలువడ్డ కొద్దిసేపటికే బెంగళూరు సేల్ డీల్ కూడా ఖాయమైంది.
ఆదిత్యా బిర్లా గ్రూప్ (ఏబీజీ), బ్లాక్‌స్టోన్, డేవిడ్ బ్లిట్జర్స్ బోల్ట్ వెంచర్స్‌తో పాటు ప్రముఖ మీడియా దిగ్గజం టైమ్స్ ఆఫ్ ఇండియాతో కూడిన కన్సార్టియం ఆర్సీబీని 1.78 బిలియన్ డాలర్ల (రూ. 16,700 కోట్లు)కు సొంతం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిపై అటు ఫ్రాంచైజీలు గానీ, ఇటు సంబంధింత కొనుగోలుదారులుగానీ అధికారిక ప్రకటనేమీ చేయకపోయినా త్వరలోనే ఈ ప్రకటన వెలువడనున్నట్టు ఆ ఫ్రాంచైజీల వర్గాలు తెలిపాయి. అయితే తాజా ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే అమ్మకానికి సంబంధించిన ప్రక్రియ మొదలవనున్నట్టు తెలుస్తున్నది. బీసీసీఐ ఆమోదం పొందిన వెంటనే యాజమాన్య హక్కులు బదిలీ అవుతాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బీసీసీఐ నిర్వహించే ఏజీఎం తర్వాతే ఈ సేల్ డీల్ పూర్తవనుంది.
తాజా డీల్‌తో ఐపీఎల్లో బెంగళూరు, రాజస్థాన్ అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీలుగా నిలిచాయి. 2021లో బీసీసీఐ నిర్వహించిన కొత్త ఫ్రాంచైజీల వేలంలో సంజీవ్ గొయెంకా సారథ్యంలోని ఆర్పీఎస్జీ లక్నో జట్టును రూ. 7వేల కోట్లకు కొనుగోలు చేయడమే ఇప్పటిదాకా రికార్డు. తాజా డీల్ అందుకు రెండింతలుండటం గమనార్హం. నాలుగు సంస్థలతో కూడిన ఆర్సీబీ కన్సార్షియం.. యూనైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్) నుంచి పూర్తిస్థాయి యాజమాన్య హక్కులను సొంతం చేసుకోనుంది.
ఈ డీల్‌తో ఆర్సీబీ మెన్స్, ఉమెన్స్ జట్ల ఓనర్షిప్ రైట్స్.. కొత్త కన్సార్షియానికి బదిలీ అవనున్నాయి. ఈ గ్రూప్‌నకు ఆదిత్యా బిర్లా గ్రూప డైరెక్టర్ ఆర్యమన్ విక్రమ్ బిర్లా చైర్మన్‌గా వ్యవహరించనుండగా టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి సత్యన్ గజ్వాని ఉపాధ్యక్షుడుగా ఉంటారు. ఇక రాయల్స్‌ను దక్కించుకునేందుకు ఆర్సీబీ యాజమాన్య పగ్గాలు అందుకోనున్న ఏబీజీతో పాటు మరో రెండు, మూడు ప్రముఖ సంస్థలు రేసులో నిలిచినా సోమానీ కన్సార్టియం అందరికంటే ఎక్కువ బిడ్ వేసి రాజస్థాన్‌ను చేజిక్కించుకున్నట్టు తెలుస్తున్నది.
యూఎస్‌లోని అరిజోనా రాష్ర్టానికి చెందిన సోమాని.. 15 ఏండ్లుగా వ్యాపారరంగంలో ఉన్నారు. ఎడ్టెక్, ఇంట్రా ఎడ్జ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ట్రయోతో పాటు డేటా ప్రైవసీ రంగాల్లో ఆయనకు పెట్టుబడులున్నాయి. వ్యాపార రంగంలోనే గాక క్రీడల్లోనూ ఆయన భాగస్వామ్యం ఉంది. అమెరికాలో ప్రఖ్యాతిగాంచిన మోటార్ సిటీ గోల్ఫ్ క్లబ్, టీజీఎల్ టుమారో గోల్ప్ లీగ్ (ప్రముఖ గోల్ఫర్ టైగర్ వుడ్స్ దీని సహ వ్యవస్థాపకుడు)లో ఆయన పెట్టుబడులు పెట్టారు. రాజస్థాన్‌ను దక్కించుకున్న ఆయన 2021లోనే ఈ ఫ్రాంచైజీలో వాటాలు కొన్నారు.
81 ఏండ్ల రాబ్ వాల్టన్.. వాల్‌మార్ట్ వ్యవస్థాపకుడైన సామ్ వాల్టన్ చిన్న కొడుకు. 1999 నుంచి 2015 దాకా ఆయన సంస్థ చైర్మన్‌గా వ్యవహరించారు. అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్)లో వాల్‌మార్ట్ ఫ్యామిలీ.. 2022లో డెన్వెర్ బ్రొంకొస్ జట్టును 4.65 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. అంతేగాక మేజర్ లీగ్ బేస్బాల్లోనూ ఆ కుటుంబానికి అరిజోనా జట్టులో పది శాతం వాటాలున్నాయి. ఇక హ్యాంప్ ఫ్యామిలీ కుటుంబానికి వస్తే దిగ్గజ కార్ల సంస్థ ‘ఫోర్డ్’ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్ వారసురాలే షీలా ఫోర్డ్ హ్యాంప్. ఎన్ఎఫ్ఎల్లో డెట్రాయెట్ లయన్స్‌కు ఆమె యజమాని. కాగా తాజా రాయల్స్ సేల్ డీల్‌తో ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజీ పూర్తిస్థాయిగా విదేశీ యజమానుల చేతుల్లోకి వెళ్లనుండటం గమనార్హం.
ఐపీఎల్ ప్రారంభ దశ నుంచి ఈ లీగ్‌లో భాగమైన ఈ రెండు జట్ల విలువ భారీగా పెరిగింది. 2008లో రాజస్థాన్ విలువ రూ. 320 కోట్లు కాగా ఇప్పుడది రూ. 15 వేల కోట్లుగా ఉంది. అప్పుడు బెంగళూరు విలువ రూ. 446 కోట్లుగా ఉంటే తాజా డీల్‌లో అది రూ. 16 వేల కోట్లకు పైమాటే. ప్రపంచ క్రీడా యవనికపై ఐపీఎల్ బ్రాండ్ ఏస్థాయిలో ఉందో చెప్పడానికి ఈ తాజా ఒప్పందమే నిదర్శనం.