హైదరాబాద్, ఆట ప్రతినిధి: భువనేశ్వర్‌లోని ప్రతిష్టాత్మక కళింగ స్టేడియం వేదికగా జరుగుతున్న 24వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ అథ్లెట్లు జివాంజీ దీప్తి, అకీరా నందన్ పసిడి పతకాలతో మెరిశారు. శుక్రవారం జరిగిన మహిళల 400మీటర్ల టీ20 రేసును దీప్తి 57.75 సెకన్లలో ముగించి స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. ట్రాక్‌పై చిరుతను తలపించిన దీప్తి ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ అగ్రస్థానంలో నిలిచింది.
ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఈ వరంగల్ యువ అథ్లెట్లు మరోమారు తన సత్తాచాటింది. మరోవైపు పురుషుల 400మీటర్ల టీ38 రేసును అకీరా నందన్ 51.99 సెకన్లలో పూర్తి చేసి పసిడి దక్కించుకున్నాడు.
జాతీయ వేదికపై రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాణించిన దీప్తి, అకీరా నందన్‌ను పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఫౌండర్, సెక్రెటరీ గాడిపల్లి ప్రశాంత్ ప్రత్యేకంగా అభినందించారు. వీరి పట్టుదల, కఠోర శ్రమకు పతకాలే నిదర్శమని, ప్రతిభ కల్గిన ప్లేయర్లకు పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.