హనుమకొండ చౌరస్తా: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరిగిన 10వ తెలంగాణ రాష్ట్ర టోర్నీలో ఓవరాల్ విజేతగా భద్రాద్రి కొత్తగూడెం నిలిచింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో యూత్ 18 ఏండ్ల వయసు విభాగంలో హనుమకొండ, అమ్మాయిల అండర్-18 కేటగిరీలో భద్రాద్రి కొత్తగూడెం, పురుషుల విభాగంలో కరీంనగర్, మహిళల విభాగంలో ఖమ్మం టైటిళ్లు దక్కించుకున్నాయి. టోర్నీలో యూత్ కేటగిరీలో పతకాలు సాధించిన ప్లేయర్లు ఈ నెల 15 నుంచి ఛత్తీస్‌గఢ్‌లో జరిగే జాతీయస్థాయి టోర్నీలో పోటీపడనున్నారు.
మరోవైపు పురుషుల, మహిళల విభాగంలో ఎంపికైన ప్లేయర్లు ఈ నెల 29 నుంచి పంచకుల(హర్యానా)లో జరిగే నేషనల్ టోర్నీలో పాల్గొంటారు. టోర్నీ ముగింపు కార్యక్రమానికి తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్టాన్లీ జోన్స్, చైర్మన్ రాజేశ్వర్‌రావు, జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ నాగపురి రమేశ్, నాగబాబు, డీవైఎస్వో అశోక్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. ప్లేయర్లకు వీరు పతకాలతో పాటు బహుమతులు అందజేసి అభినందించారు. రాష్ట్ర స్థాయి టోర్నీకి ఆర్థిక సహకారం అందించిన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా హనుమకొండ అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి సారంగపాణి కృతజ్ఞతలు తెలిపారు.