ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్ అట్టహాసంగా తెరలేచింది. కనివినీ ఎరుగని రీతిలో క్రీడాభిమానులకు మరుపురాని అనుభూతిని మిగిల్చింది. ఘనమైన వారసత్వ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఆతిథ్య చైనా కొత్త హంగులు అద్దుకుంది. హాంగ్జౌ నగర విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేస్తూ వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో కండ్లు మిరుమిట్లుగొలిపే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ కట్టిపడేశాయి. అఫ్గానిస్థాన్ మొదలై ఆతిథ్య చైనాతో ముగిసిన అథ్లెట్ల మార్చ్ అలరించింది. హర్మన్ లవ్లీనా బొర్గోహై మువ్వన్నెల పతాకాన్ని ధరించి స్టేడియంలోకి ప్రవేశించగా కరతాళ ధ్వనులతో స్వాగతం లభించింది. గతానికి పూర్తి భిన్నంగా వర్తమానానికి దిక్సూచిలా సాగిన ఆసియాగేమ్స్ ప్రారంభ వేడుక అద్భుతం అనిపించింది. నేటి నుంచి అసలు సిసలైన పోటీలతో గేమ్స్ కొత్త కల రానుంది.
హాంగ్జౌ: ఆహా ఏమా దృశ్యాలు! కడు కనులకు ఇంపుగా ఉన్నాయి. అవును హాంగ్జౌ ‘బిగ్ లోటస్’ స్టేడియం వేదికగా శనివారం జరిగిన 19వ ఆసియాగేమ్స్ ప్రారంభోత్సవ వేడుకలు మరో లెవల్లో జరిగాయి. దాదాపు 80 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో చైనా తమ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన వైనం నభూతో నభవిష్యత్. ఒలింపిక్స్ స్థాయిలో ఆసియాగేమ్స్ చైనా కొత్త ట్రెండ్ నెలకొల్పింది. పోటీలకు ఆతిథ్యమిస్తున్న అతి ప్రాచీన నగరంగా పేరొందిన హాంగ్జౌ విశిష్టతను ప్రతిబింబిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించారు. ముఖ్యంగా అక్కడి ప్రకృతి పర్యావరణ ప్రాముఖ్యతను కోట్లాది మందికి తెలిసేలా ఎక్కడా కాలుష్యానికి ఆస్కారం లేకుండా అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యాన్ని జోడిస్తూ క్రీడాభిమానులను కొత్తలోకంలోకి తీసుకెళ్లారు. చైనా అధ్యక్షుడు జీ జిన్ తొలుత ఆసియాగేమ్స్ అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. ఆ తర్వాత ఇంగ్లిష్ అక్షర క్రమాన్ని అనుసరిస్తూ తొలుత అఫ్గానిస్థాన్ ప్లేయర్లు స్టేడియంలోకి ప్రవేశించింది. ఎనిమిదో వరుసలో భారత క్రీడా బృందం అభిమానులకు అభివాదం చేస్తూ జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ ముందుకు సాగింది. హాకీ కెప్టెన్ హర్మన్ స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహై ఫ్లాగ్ బేరర్స్ వ్యవహరించారు. భారత్ తర్వాత మిగతా దేశాల అథ్లెట్లు వరుస క్రమంలో స్టేడియంలోకి వచ్చారు.
జిల్ జిల్ జిగేల్:
గతంలో ఎక్కడా చూడని విధంగా చైనా..ఆసియా గేమ్స్ ప్రారంభ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహించింది. అత్యాధునిక సాంకేతికను ఉపయోగిస్తూ ఎల్ లైటింగ్ తమ దేశ సాంస్కృతిక వైభవాన్ని కండ్లకు కట్టింది. ముఖ్యం గా సముద్రతీర నగరమైన హాంగ్జౌ విశిష్టతను కళకారులు వివిధ రూపాల్లో ప్రదర్శించారు. గాల్లోకి తేలుతూ కొందరు చేసిన విన్యాసాలు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టాయి. చైనాకు చెందిన పలువురు ప్రముఖ అథ్లెట్లు బ్యాటన్ ధరించి ముందుకు సాగగా, అత్యుత్తమ సాంకేతికతో ఆసియాగేమ్స్ జ్యోతిని వెలిగించడం కార్యక్రమానికి హైలెట్ నిలిచింది.
భారత్ ప్రతినిధులు లేకుండానే
అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్లకు వీసాలు నిరాకరించిన కారణంగా భారత ప్రతినిధులు లేకుండానే ప్రారంభ కార్యక్రమం జరిగింది. క్రీడా మంత్రి అనురాగ్ చైనా పర్యటన రద్దు చేసుకోగా, ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉషా ప్రస్తు తం పరాగ్వే పర్యటనలో ఉండటంతో రాలేకపోయారు.
నేటి షెడ్యూల్
షూటింగ్: మహిళల 10మీ ఎయిర్ రైఫిల్
ఉ: 9.15 నుంచి
క్రికెట్: భారత్ X బంగ్లాదేశ్ (మహిళల)
సెమీ ఫైనల్ ఉ: 6.30 నుంచి
బాక్సింగ్: నిఖత్ జరీన్-సా: 4.30 జాస్మిన్ లంబోరియా, శివ తాపా, లక్ష్య చాహర్, పర్వీన్ హుడా, సంజీత్
హాకీ: భారత్ X ఉబ్బెకిస్థాన్, ఉ:8.45 ఫుట్ భారత్ X మయన్మార్
(పురుషుల) సా:5 నుంచి