హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ హుసేన్సాగర్ వేదికగా జాతీయ రెగెట్టా చాంపియన్‌షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్, యాచ్ క్లబ్ హైదరాబాద్ నిర్వహిస్తున్న మాన్సూన్ రెగెట్టా టోర్నీలో సెయిలర్లు పోటాపోటీగా తలపడుతున్నారు. పోటీలకు రెండో రోజైన మంగళవారం జరిగిన వేర్వేరు విభాగాల్లో తెలంగాణ, తమిళనాడు సెయిలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు.
బాలికల సబ్‌జూనియర్ విభాగంలో శ్రేయకృష్ణ(తమిళనాడు), తెలంగాణ యువ సెయిలర్ లాహిరి కొమురవెల్లి వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బాలుర సబ్‌జూనియర్ విభాగంలో తమిళనాడు సెయిలర్ కృష్ణవీఆర్, స్థానిక సెయిలర్ మహమ్మద్ రిజ్వాన్ మధ్య తీవ్ర పోటీనెలకొనగా, కృష్ణకు అగ్రస్థానం దక్కింది.
అండర్-19 మిక్స్డ్ డబుల్స్‌లో తనూజ-శ్రవణ్ జోడీ టాప్‌లో ఉండగా, దీక్షిత-గణేశ్ ద్వయం రెండో స్థానంలో ఉంది. మరోవైపు బిగినర్స్ లైట్ ఫ్లీట్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌లో సాంఘిక సంక్షేమ స్కూల్‌కు చెందిన ఆరేపల్లి గ్రేస్‌తో పాటు కొండ సామాన్యు విజేతలుగా నిలిచారు. 15 రేసుల్లో 10 గెలిచిన గ్రేసీ ఒవరాల్ చాంపియన్‌షిప్ సొంతం చేసుకుంది.