ముంబై: దేశానికి ఎందరో దిగ్గజ క్రికెటర్లను అందించిన ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీలో తమ జట్టుకు ఆడే క్రికెటర్లకు బీసీసీఐ మాదిరిగా సెంట్రల్ కాంట్రాక్టులను అందించేందుకు సిద్ధమైంది. ఆటగాళ్ల ప్రదర్శన, ఫిట్నెస్, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకోనున్న ఎంసీఏ.. వారిని మూడు గ్రేడ్లుగా విభజించి వార్షిక కాంట్రాక్టులను అందించనుంది.
గ్రేడ్-ఏలో ఉన్నవారికి ఏడాదికి రూ. 12 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు, గ్రేడ్-బీ క్రికెటర్లకు రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షలు, గ్రేడ్-సీ ఆటగాళ్లకు రూ. 8 లక్షలు అందజేయనున్నది. 2026-27 దేశవాళీ సీజన్ నుంచి దీనిని అమలుచేయనున్నారు. అయితే పురుషుల జట్టుతో పాటు మహిళా జట్టుకూ దీనిని వర్తింపజేస్తారా? లేదా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. కాగా దేశవాళీల్లో క్రికెటర్లకు కాంట్రాక్టులను అందించనున్న తొలి స్టేట్ అసోసియేషన్‌గా ఎంసీఏ నిలువనుంది.