పారిస్: పారిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టాప్‌సీడ్ల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ టోర్నీలో అదరగొడుతున్నారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో సబలెంకా 6-2, 6-2తో ఉచిజిమా(జపాన్)పై అలవోక విజయం సాధించింది. గంటా రెండు నిమిషాల పాటు సాగిన పోరులో సబలెంకా ఆది నుంచే తనదైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి రెండో రౌండ్‌కు చేరిన ఉచిజిమా.. రెండో సీడ్ సబలెంకా ముందు నిలువలేకపోయింది. మ్యాచ్‌లో రెండు ఏస్‌లు సంధించిన సబలెంకా 27 విన్నర్లతో ఆకట్టుకుంది.
12 సార్లు అనవసర తప్పిదాలకు పాల్పడిన ఉచిజిమా 10 విన్నర్లకే పరిమితమైంది. మూడో రౌండ్లో స్పెయిన్‌కు చెందిన అన్‌సీడెడ్ బడోసాతో సబలెంకాతో తలపడనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నోవాక్ జొకోవిచ్ రెండో రౌండ్ పోరులో 6-4, 6-1, 6-2తో కార్బల్లెస్ బయెన(స్పెయిన్)పై అలవోక విజయం సాధించాడు. రెండు గంటల పాటు సాగిన పోరును జొకోవిచ్ వరుస సెట్లలో కైవసం చేసుకున్నాడు. మ్యాచ్‌లో జొకోవిచ్ 5 ఏస్‌లతో పాటు 43 విన్నర్లతో దుమ్మురేపాడు. జ్వెరెవ్ 7-6(7/4), 6-2, 6-2తో గోఫిన్‌పై గెలువగా, మెద్వదెవ్‌కు వాకోవర్ లభించింది. మిగతా మ్యాచ్‌ల్లో స్వితోలినా, రిబకినా, కీస్, హర్కజ్, దిమిత్రోవ్, వొండ్రుసోవా తర్వాత రౌండ్లలోకి ప్రవేశించారు.