Rishabh Pant | భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గత శుక్రవారం ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తున్న సమయంలో అతను ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ సమయంలో పంత్‌కు రజత్, నిషు అనే ఇద్దరు యువకులు సహాయం చేశారు. రిషబ్ కారు కాలిపోతున్న సమయంలో కారులో నుంచి పలు వస్తువులు, కొంత నగదు కూడా వారే తీశారు.
కాగా, కారులో నుంచి తీసిన రూ.4వేల రూపాయలను వారిద్దరూ నిజాయితీగా తిరిగి ఇచ్చేశారు. డెహ్రాడూన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్‌ను పరామర్శించిన వారు.. అక్కడ నగదును పోలీసులకు అందించారు. దీంతో యువకుల నిజాయితీని పోలీసులు అభినందించారు.
రిషబ్ పంత్ శుక్రవారం తెల్లవారుజామున కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ వద్ద పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదం తర్వాత కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పంత్ వెంటనే కారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ప్రమాదంలో పంత్‌కు స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి వైద్యులు, బీసీసీఐ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉంది.