Former cricketer : భారత మాజీ క్రికెటర్ (Former cricketer) శ్రీశాంత్ (Srishanth) పై సస్పెన్షన్ వేటు పడింది. కేరళ క్రికెట్ అసోషియేషన్ (KCA) ఆయనపై మూడేళ్ల నిషేధం విధించింది. అసోషియేషన్‌కు వ్యతిరేకంగా అసత్యపు ఆరోపణలు, కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనను మూడేళ్ల పాటు సస్పెండ్ చేసింది. భారత జట్టులో సంజూ శాంసన్ (Sanju Samson) కు చోటుదక్కకపోవడంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో కేరళ క్రికెట్ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా శ్రీశాంత్ కామెంట్స్ చేయడం సస్పెన్షన్‌కు దారితీసింది.
ఇదే అంశాన్ని శ్రీశాంత్ ముందు ప్రస్తావించగా.. సస్పెన్షన్‌కు సంబంధించి కేరళ క్రికెట్ అసోషియేషన్ నుంచి తనకు ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పాడు. కేవలం మీడియా ద్వారానే తాను ఈ విషయం తెలుసుకున్నానని అన్నాడు. ఏ కారణం చేత తనను సస్పెండ్ చేశారో తనకు ఇంకా తెలియదని తెలిపాడు. తాను రాష్ట్రానికి చెందిన క్రికెటర్‌కు మద్దతుగా మాట్లాడటం తప్పుకాదని పేర్కొన్నాడు. నోటీసులు అందిన తర్వాత తాను ఏం చేయాలో నిర్ణయించుకుంటానని చెప్పాడు.