India | బ్యాంకాక్: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఏషియన్ రిలే చాంపియన్‌షిప్స్ తొలి ఎడిషన్‌లో భారత మిక్స్డ్ 4×400 మీటర్ల రిలే బృందం సత్తా చాటింది. మహ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, సుభా వెంకటేశన్, తెలుగు అమ్మాయి శ్రీదండి జ్యోతికతో కూడిన నలుగురు అథ్లెట్ల బృందం స్వర్ణం గెలుచుకుంది. సోమవారం జరిగిన 4×400 మీటర్ల రిలే ఈవెంట్‌ను 3 నిమిషాల 14.12 సెకన్లలోనే పూర్తిచేసిన అథ్లెట్లు సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు.
తద్వారా గతేడాది ఆసియా క్రీడల్లో (హాంగ్జౌ) నమోదైన 3 నిమిషాల 14.34 సెకన్ల రికార్డును బ్రేక్ చేశారు. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో బెర్తును దక్కించుకోవడానికి మాత్రం తాజా ప్రదర్శన సరిపోలేదు. వరల్డ్ అథ్లెటిక్స్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ప్రదర్శన 21వ స్థానంలో నిలవగా 15 లేదా 16వ స్థానం వస్తే పారిస్ కోటా ఖాయమయ్యేది. సోమవారం నాటి పోరులో భారత బృందం గనక 3:13.56 నిమిషాల్లో రేసును పూర్తిచేస్తే అప్పుడు 16వ స్థానంలో నిలిచి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగే అవకాశముండేది. కానీ నిమిషం వ్యవధిలో భారత్ ఆ చాన్స్ కోల్పోయింది. టాప్-16లో ఉన్న టీమ్స్ ఒలింపిక్స్‌లో పాల్గొంటాయి.