షిమ్కెంట్(కజకిస్థాన్): ఏషియన్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. పోటీల రెండో రోజైన మంగళవారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో డబుల్ ఒలింపియన్ మను భాకర్ కాంస్య పతకంతో మెరిసింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో మను భాకర్ 219.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో క్వియాన్కె మా(చైనా, 243.2), జిన్ యాంగ్(కొరియా, 241.6) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు.
మహిళల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లోనూ మను భాకర్(583), పాలక్(573), సురుచిసింగ్(574)తో కూడిన భారత త్రయం కాంస్యం ఖాతాలో వేసుకుంది. మరోవైపు మహిళల జూనియర్ పిస్టల్ ఈవెంట్లో యువ షూటర్ రశ్మిక సెహగల్ 241.9 పాయింట్లతో స్వర్ణంతో మెరిసింది.
అదే దూకుడు కొనసాగిస్తూ టీమ్ఈవెంట్లోనూ రశ్మిక(582), వంశిక చౌదరీ (573), మోహిని సింగ్(565)త్రయం పసిడి కైవసం చేసుకుంది. టోర్నీలో ఇప్పటి వరకు భారత్ ఐదు స్వర్ణాలు సహా రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో కొనసాగుతున్నది.