పొట్టి ప్రపంచకప్ పోరును ఆతిథ్య వెస్టిండీస్ విజయంతో మొదలు పెట్టింది. పపువా న్యూ గినియా (పీఎన్జీ) తో గయానా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టును తక్కువ స్కోరుకే కట్టడిచేసిన విండీస్.. స్వల్ప ఛేదనలో తడబడ్డా ఎట్ట కేలకు లక్ష్యాన్ని అందుకుంది. బ్యాటిం గ్లో విఫలమైనా పీఎన్జీ బౌలింగ్‌లో విండీస్‌ను కాస్త భయపెట్టింది. రోస్టన్ ఛేజ్ మెరుపులకు తోడు ఆండ్రీ రస్సెల్ ఆల్ రౌండ్ షోతో కరేబియన్ జట్టు తొలి విఘ్నాన్ని విజయవంతంగా దాటింది.
గయానా: మూడో టీ20 వరల్డ్ కప్ వేటలో ఉన్న వెస్టిండీస్.. సొంతగడ్డపై ఈ టోర్నీని విజయంతో ప్రారంభించింది. ఆదివారం గయానా వేదికగా పపువా న్యూ గినియా (పీఎన్జీ)తో జరిగిన గ్రూప్-సీ మొదటి మ్యాచ్‌లో ఆ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పీఎన్జీ.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులకే పరిమితమైంది. సెసె బౌ (43 బంతుల్లో 50, 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. విండీస్ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ (2/19), అల్జారీ జోసెఫ్ (2/34) రాణించారు. అనంతరం స్వల్ప ఛేదనలో విండీస్ తడబాటుకు గురైనా 19 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తిచేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రోస్టన్ ఛేజ్ (27 బంతుల్లో 42 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రాండన్ కింగ్ (29 బంతుల్లో 34, 7 ఫోర్లు) వేగంగా ఆడారు.
మొదట బ్యాటింగ్ చేసిన పీఎన్జీ బ్యాటర్లలో బౌ ఒక్కడే కాస్త పోరాడాడు. కరేబియన్ బౌలర్లు విజృంభించడంతో ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినా సెసె మాత్రం నిలబడ్డాడు. 42 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. పీఎన్జీ తరఫున సభ్య దేశాలపై ఇదే రెండో అర్ధ శతకం కావడం విశేషం. ఆఖర్లో వికెట్ కీపర్ కిప్లిన్ డొరిగ (27) మెరుపులతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది.
స్వల్ప ఛేదనే అయినా విండీస్ ఇన్నింగ్స్ ఒడిదొడుకుల మధ్య సాగింది. ఓపెనర్ జాన్సన్ చార్లెస్ డకౌట్ అవగా బ్రాండన్ కింగ్‌తో కలిసి నికోలస్ పూరన్ (27) దూకుడుగా ఆడాడు. కానీ ఈ ఇద్దరూ రెండు ఓవర్ల వ్యవధిలో ఔట్ అయ్యా రు. విండీస్ సారథి పావెల్ (15), రూథర్‌ఫర్డ్ (2) విఫలమైనా రస్సెల్ (15 నాటౌట్) రోస్టన్ ఛేజ్ లాంఛనాన్ని పూర్తిచేశాడు.