నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రాజస్థాన్ రాయల్స్‌ను రెండుసార్లు ఓడించి.. జోరు మీదున్న పంజాబ్ కింగ్స్ పని పట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. విధ్వంసకర బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్ (494 పరుగులు), అభిషేక్ శర్మ (475) బ్యాట్‌తో దంచుతుండగా.. పేసర్ ఈషాన్ మలింగ (16 వికెట్లు) బంతితో అదరగొడుతున్నాడు. అయితే, వీళ్లందరికంటే సన్‌రైజర్స్ విజయాల్లో ఓ అదృశ్య శక్తి కీలక పాత్ర పోషిస్తున్నది.
ఆ శక్తి మరెవరో కాదు తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి. అటు బ్యాటు, ఇటు బంతితో రాణిస్తూ.. రెండు విభాగాలకు బలం తీసుకొస్తున్న నితీశ్ ఆల్‌రౌండర్ పదానికి అసలైన అర్థం చెబుతున్నాడు. హేమాహేమీలు ఉన్న ఈ జట్టులో నితీశ్ ఓ గేమ్ చేంజర్‌గా మారి జట్టును విజయ తీరాల వైపు నడిపిస్తున్నాడు. ఐపీఎల్లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ల ప్రాధాన్యత తగ్గిపోతుందనే వాదనలు ఉన్నా, నితీశ్ వాటిని పటాపంచలు చేస్తున్నాడు. సన్‌రైజర్స్ ఈ ఏడాది టైటిల్ వేటలో ఉండాలంటే అతను అందించే ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శనే అత్యంత కీలకం కానుంది.
ఈ సీజన్లో సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు అభిషేక్ ్మ, హెడ్, ఇషాన్, క్లాసెన్ అద్భుతంగా రాణిస్తూ ఏకంగా 1739 పరుగులు రాబట్టారు. బౌలింగ్‌లోనూ ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్ (10 వికెట్లు) ప్రత్యర్థులను వణికిస్తున్నారు. అయితే, రెండు విభాగల మధ్య వారధిలా నిలుస్తూ నితీశ్ చేస్తున్న ప్రదర్శన జట్టుకు ఊపిరిగా మారింది. బ్యాటింగ్‌లో 166.91 స్ట్రయిక్ రేట్‌తో ఇప్పటివరకు 222 పరుగులు సాధించిన అతను బ్యాటర్ల స్వర్గధామం లాంటి పిచ్‌లపై సైతం 10.39 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్ తుది జట్టును పరిపూర్ణం చేయడంలో నితీశ్ పాత్ర ఎంత విలువైనదో చెప్పేందుకు ఆదివారం సొంతగడ్డపై కోల్‌కతాతో మ్యాచే ఉదాహరణ.
అనారోగ్యం కారణంగా నితీశ్ దూరం అవ్వడంతో ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఒక ఫినిషర్‌ను మాత్రమే కాకుండా, మిడిల్ ఓవర్లలో పట్టు బిగించే బౌలర్‌ను కూడా కోల్పోయి ఓడిపోయింది. అయితే మూడు రోజులు తిరిగే సరికి పంజాబ్ కింగ్స్‌తో పోరుకు నితీశ్ అందుబాటులోకి రావడంతోనే ఆరెంజ్ ఆర్మీ శిబిరంలో పాత ఉత్సాహం ఉట్టిపడింది. తను తిరిగి రాగానే పక్కాగా కుదిరిన జట్టు కూర్పు విజయానికి బాటలు వేసింది. ఆ మ్యాచ్‌లో నితీశ్ కేవలం 13 బంతుల్లోనే 29 పరుగులు పిండుకుని జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆపై బౌలింగ్‌లోనూ చెలరేగి ప్రమాదకరమైన ప్రభ్సిమ్రాన్ సింగ్‌ను పెవిలియన్‌కు పంపాడు. కేవలం 2 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక వికెట్ తీయడం అతని పరిణతికి నిదర్శనం.
నితీశ్ ప్రయాణంలో ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది.ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇన్‌స్టాగ్రామ్‌లో మాజీ కౌంటీ క్రికెటర్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ సెఫాన్ జోన్స్ కోచింగ్ వీడియో చూసిన నితీశ్ నేరుగా అతనికి మెసేజ్ చేశాడు. గతంలో ఇషాంత్ శర్మతో పనిచేసిన అనుభవం జోన్స్‌కు ఉంది. వారం తిరగకముందే బెంగళూరు చేరుకున్న నితీశ్ జోన్స్ సూచనతో తన రన్-అప్ లోని లోపాలను సరిదిద్దుకున్నాడు. ఒకప్పుడు ఫైన్ లెగ్ వైపు వెళ్లే తన రన్-అప్ను బ్యాటర్ వైపు తిన్నగా ఉండేలా మార్చుకున్నాడు. కేవలం వారం రోజుల్లోనే తన బౌలింగ్ వేగాన్ని 10 కిలోమీటర్ల మేర పెంచుకుని 139 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం ప్రారంభించాడు. పవర్ ప్లేలో బంతిని రెండు వైపులా స్వింగ్ చేసి ఫలితం రాబడుతున్నాడు. గత సీజన్లో 118గా ఉన్న స్ట్రయిక్ రేట్‌ను ఈ ఏడాది 167కు పెంచుకున్నాడు.
నిజానికి ఎంసీజీలో ఆస్ట్రేలియాపై అద్భుత శతకంతో నితీశ్ కుమార్ ఒక్కసారిగా హీరో అయ్యాడు. కానీ, ఆ స్టార్డమ్ తర్వాత ఒక్కసారిగా పెరిగిన అంచనాలను నితీశ్ అందుకోలేదనే చెప్పాలి. నిరుడు ఐపీఎల్లో ఆకట్టుకోలేకపోయిన ఈ వైజాగ్ కుర్రాడు ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. ఆ తర్వాత నితీశ్‌ను అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ పూర్తిస్థాయిలో రాణించలేని ‘బిట్స్ అండ్ పీసెస్’ క్రికెటర్ అంటూ నెటిజన్లు ఎగతాళి చేశారు.
అయితే ఈ విమర్శలు పట్టించుకోని తెలుగు కుర్రాడు తన ఆటను మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెట్టాడు. ఆ ఫలితాన్ని ప్రస్తుత ఐపీఎల్లో చూస్తున్నాం. 2027 ప్రపంచకప్ దృష్ట్యా భారత్‌కు ఒక పటిష్టమైన సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అవసరం ఉంది. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా నితీశ్ కనిపిస్తున్నాడు. టెస్టుల్లో సెంచరీ, టీ20ల్లో 180 స్ట్రయిక్ రేట్ ఉన్న నితీశ్ ఇదే జోరు కొనసాగిస్తూ ఫిట్నెస్ కాపాడుకుంటే భారత జట్టుకు తిరుగులేని ఆస్తిగా మారతాడనంలో సందేహం లేదు.