వరుణుడి దోబూచులాట, మైదానం సరిగ్గా లేకపోవడంతో రెండు రోజుల పాటు టెస్టు మ్యాచ్‌కు దూరమై ఫలితం వస్తుందో? రాదో? అన్న నిరాశలో కూరుకుపోయిన క్రికెట్ అభిమానులకు భారత జట్టు నాలుగో రోజు పసందైన విందు భోజనం అందించింది. టెస్టులలో టీ20 ఆటను ఆడుతూ ఫ్యాన్స్‌కు ఆనందాన్ని, మ్యాచ్‌లో ఫలితాన్ని తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ధనాధన్ బ్యాటింగ్‌కు తోడు అదిరిపోయే బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఓటమి దిశగా నడిపిస్తోంది. టెస్టులలో ఫాస్టెస్ట్ 50, 100, 200.. ఇలా రికార్డులన్నింటినీ చెల్లాచెదురు చేసిన రోహిత్ సేన.. నాలుగో రోజు ప్రత్యర్థి 2 వికెట్లు పడగొట్టి వికెట్ల వేట మొదలెట్టింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Kanpur Test | కాన్పూర్: భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు అనూహ్య మలుపులు తిరిగింది. వర్షం అంతరాయానికి తోడు మైదానం ఆటకు అనువుగా లేకపోవడంతో రెండు రోజుల ఆట కోల్పోయిన ఈ టెస్టులో నాలుగో రోజు భారత్ అన్ని విభాగాల్లో అదరగొట్టింది. మొదట బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌట్ చేసిన రోహిత్ సేన.. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చి మెరుపులు మెరిపించింది. బంగ్లా జట్టులో మోమినుల్ హక్ (107 నాటౌట్, 17 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదంతొక్కగా మిగిలినవారంతా విఫలమయ్యారు.
భారత్ 34.4 ఓవర్లలోనే 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. యశస్వీ జైస్వాల్ (51 బంతుల్లో 72, 12 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 68, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (35 బంతుల్లో 47, 4 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్‌కు 52 పరుగుల కీలక ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న పర్యాటక జట్టు.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 11 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆటలో ఒక్కరోజే 18 వికెట్లు నేలకూలడం గమనార్హం.
బంగ్లాకు నాలుగో రోజు ఉదయం సెషన్ ఐదో ఓవర్లోనే తొలి షాక్ తాకింది. బుమ్రా బౌలింగ్‌లో ముష్ఫీకర్ (11) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో 3 బౌండరీలు బాదిన లిటన్ దాస్ (13) డ్రింక్స్ తర్వాత సిరాజ్ వేసిన తొలి ఓవర్లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. అశ్విన్ బౌలింగ్‌లో సిరాజ్ పట్టిన సంచలన క్యాచ్‌తో షకిబ్ (9) కథ ముగిసింది. సహచర ఆటగాళ్లు వెనుదిరుగుతున్నా మోమినుల్ హక్ మాత్రం భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. లంచ్ విరామానికి ముందు ఓవర్లో బౌండరీతో అతడు శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. లంచ్ తర్వాత బంగ్లా ఇన్నింగ్స్ పతనం వేగంగా సాగింది. మెహిది హసన్ మిరాజ్ (20) నిష్క్రమణతో ఆరు పరుగుల తేడాతో ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది.
ఇన్నింగ్స్‌ను భారత్ ఫోర్లు, సిక్సర్లతో దూకుడుగా మొదలుపెట్టింది. హసన్ మహ్ముద్ తొలి ఓవర్లోనే జైస్వాల్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి భారత ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు. రెండో ఓవర్లో రోహిత్ (11 బంతుల్లో 23, 1 ఫోర్, 3 సిక్సర్లు) రెండు వరుస సిక్సర్లు బాదాడు. హసన్ మూడో ఓవర్లో అయితే ఈ ఇద్దరూ కలిసి 22 పరుగులు రాబట్టడంతో 3 ఓవర్లలోనే టీమ్ఇండియా 50 పరుగుల మార్కును దాటింది. మిరాజ్ 4వ ఓవర్లో రోహిత్ బౌల్డ్ అయినా భారత్ దూకుడు మాత్రం తగ్గలేదు. వన్‌డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (36 బంతుల్లో 39, 4 ఫోర్లు, 1 సిక్సర్) అండగా జైస్వాల్ రెచ్చిపోయాడు. ఈ క్రమంలో 31 బంతుల్లోనే అతడి అర్ధశతకం పూర్తయింది. జైస్వాల్, గిల్ మెరుపులతో 10.1 ఓవర్లోనే భారత్ వంద పరుగుల మార్కును దాటింది.
ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే క్రమంలో జైస్వాల్, గిల్ నిష్క్రమించారు. రిషభ్ పంత్ (9) నిరాశపరిచినా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ(47)ధాటిగా ఆడాడు. తొలి టెస్టులో విఫలమైనా రాహుల్ కాన్పూర్‌లో మాత్రం జూలు విదిల్చాడు. ఈ ఇద్దరూ వేగంగా పరుగులు రాబట్టడంతో 25 ఓవర్లకే భారత స్కోరు 200 దాటింది. ఇన్నింగ్స్ 28వ ఓవర్‌కే రోహిత్ సేన.. బంగ్లా స్కోరు (233)ని అధిగమించింది.
దూకుడుగా ఆడిన రాహుల్ 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. అయితే 30వ ఓవర్లో షకిబ్.. కోహ్లీని బౌల్డ్ చేయడంతో భారత్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. జడేజా (8), అశ్విన్ (1), ఆకాశ్ దీప్ (12) వేగంగా ఆడే క్రమంలో పెవిలియన్‌కు క్యూ కట్టారు. రాహుల్ స్టంపౌట్ అయ్యాడు. ఆకాశ్ నిష్క్రమణ తర్వాత రోహిత్.. భారత ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేశాడు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 52 పరుగుల విలువైన ఆధిక్యం దక్కింది.
సుడిగాలిలా ఆడిన భారత ఆటగాళ్ల ఇన్నింగ్స్ తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా వికెట్లను కాపాడుకోవడానికి కష్టపడింది. ఓపెనర్లు షద్మాన్ ఇస్లాం (40 బంతుల్లో 7 బ్యాటింగ్), జకీర్ హసన్ (10) డిఫెన్స్‌నే ఆశ్రయించారు. బుమ్రా, అశ్విన్ కవ్వించే బంతులు విసిరినా షాట్ల జోలికి పోలేదు. అయితే 8వ ఓవర్లో అశ్విన్.. ఫ్లైటెడ్ డెలివరీతో జకీర్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన హసన్ మహ్ము ద్ (4) నూ బౌల్డ్ చేసి బంగ్లాకు గట్టి హెచ్చరికలు పంపాడు.
అంతర్జాతీయ క్రికెట్లో 27వేల కోహ్లీ పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో వేగంగా (594 ఇన్నింగ్స్) ఈ రికార్డు సాధించిన తొలి క్రికెటర్ అతడే. ఈ జాబితాలో సచిన్ (623 ఇన్నింగ్స్), సంగక్కర (648 ఇన్నింగ్స్), పాంటింగ్ (650 ఇన్నింగ్స్) రికార్డులను కోహ్లీ అధిగమించాడు.
1టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులు సాధించిన జట్టుగా భారత్ ఘనత.
2 టెస్టులలో వేగంగా (74 టెస్టులలో) 300 వికెట్లు, 3 వేల పరుగులు చేసిన రెండో ఆటగాడు జడేజా. ఇయాన్ భోథమ్ (72) ముందున్నాడు.
4 టెస్టులలో భారత్ తరఫున యశస్వీ నాలుగో వేగవంతమైన (31 బంతుల్లో) ఫిఫ్టీ చేశాడు. ఈ జాబితాలో పంత్ (28), కపిల్ దేవ్ (30), శార్దూల్ (31) తర్వాత జైస్వాల్ నిలిచాడు. ఓపెనర్ల పరంగా చూస్తే జైస్వాల్‌దే అగ్రస్థానం.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 233 ఆలౌట్ (మోమినుల్ 107 నాటౌట్, శాంతో 31, బుమ్రా 3/50, ఆకాశ్ 2/43);
భారత్ తొలి ఇన్నింగ్స్: 285/9 డిక్లేర్డ్ (యశస్వీ 72, రాహుల్ 68, మిరాజ్ 4/41, షకిబ్ 4/78);
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 26/2 (జకీర్ 10, అశ్విన్ 2/14)