ఈస్ట్ రూథర్‌ఫోర్డ్ (యూఎస్ఏ): ఫిఫా వరల్డ్ కప్‌లో మరో సంచలనం. నాలుగుసార్లు చాంపియన్, వరుసగా 11 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని మేటి జట్టు జర్మనీకి షాక్ తగిలింది. ఇప్పటికే నాకౌట్ చేరుకున్న ఆ జట్టుకు ఝలక్ ఇస్తూ ఈక్వెడార్ రౌండ్-32కు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన గ్రూప్-ఈ మ్యాచ్‌లో ఈక్వెడార్ 2-1తో జర్మనీని ఓడించింది. రెండో నిమిషంలోనే ప్రత్యర్థికి గోల్ ఇచ్చుకొని వెనుకంజ వేసినా అద్భుతమైన పోరాట పటిమతో పుంజుకుంది. 77వ నిమిషంలో గొంజాలో ప్లాటా చేసిన గోల్‌తో ప్రత్యర్థి పని పట్టి మెగా టోర్నీలో రెండోసారి నాకౌట్ చేరుకుంది.
2006లో తొలిసారి నాకౌట్లో ఆడింది. ఈ పోరులో ఈక్వెడార్ తరఫున మరో గోల్ నిల్సన్ ఆంగులో (9వ నిమిషం) సాధించాడు. జర్మనీ ఆటగాడు లెరాయ్ సనే 2వ నిమిషంలో గోల్ కొట్టినా.. అదే జోరు కొనసాగించలేకపోయిన మాజీ చాంపియన్ టోర్నీలో తొలి ఓటమి ఖాతాలో వేసుకుంది. అయినా మొదటి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన జర్మనీ 6 పాయింట్లతో గ్రూప్-ఈ టాపర్‌గా నాకౌట్లో అడుగు పెట్టింది. ఈక్వెడార్ 4 పాయింట్లతో మూడో స్థానంతో రౌండ్-32 బెర్తు ఖాయం చేసుకుంది.
హ్యాట్రిక్ విజయంతో నాకౌట్ రౌండ్‌కు సిద్ధమవ్వాలని బరిలోకి దిగిన జర్మనీ అందుకు తగ్గట్టుగానే రెండో నిమిషంలోనే గోల్ రాబట్టింది. అలెగ్జాండర్ పావ్లోవిచ్, ఫ్లోరియన్ విరట్జ్ అందించిన పాస్‌ను అందుకొని లెరాయ్ సనే ఈక్వెడార్ కీపర్ హెర్నాన్ గాలిందెజ్ను దాటుకుంటూ బంతిని నెట్లోకి పంపి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. కానీ, జర్మనీ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. 9వ నిమిషంలోనే ఈక్వెడార్ స్కోరును సమం చేసింది. జర్మనీ మిడ్‌ఫీల్డర్ ఫెలిక్స్ నెచా నుంచి పెడ్రో విటే బంతిని లాక్కుని నిల్సన్ అంగులోకు పాస్ ఇచ్చాడు. అంగులో బంతితో దూసుకెళ్లి జర్మనీ సీనియర్ కీపర్ మాన్యుయెల్ నోయర్ను ఏమారుస్తూ దూరం నుంచి అద్భుత గోల్ సాధించాడు. దీంతో స్కోరు సమమైంది.
ఇక రెండో అర్ధభాగం ప్రారంభమైన 30 సెకండ్లకే కై హావెరట్జ్ను ఈక్వెడార్ డిఫెండర్ జోయెల్ ఓర్డోనెజ్ కిందపడేయంతో అమెరికా మహిళా రిఫరీ టోరి పెన్సో జర్మనీకి పెనాల్టీ కిక్ ఇచ్చింది. అయితే, వీడియో రివ్యూ (వార్) లో అంతకుముందే లెరాయ్ ఈక్వెడార్ ఆటగాడు విటేపై ఫౌల్ చేసినట్లు తేలడంతో రిఫరీ ఆ పెనాల్టీని రద్దు చేసింది. ఇక మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనుకున్న సమయంలో 77వ నిమిషంలో విటే కొట్టిన కార్నర్ కిక్‌ను రోడ్రిగ్జ్ హెడర్ ద్వారా గోల్ పోస్ట్ ముందుకు పంపాడు. జర్మనీ 40 ఏండ్ల కీపర్ మాన్యుయెల్ నోయర్ ఆ బంతిని అందుకునేలోపే 25 ఏండ్ల వింగర్ గొంజాలో ప్లాటా బంతిని నెట్లోకి నెట్టి ఈక్వెడార్‌ను గెలిపించాడు.
ఐవరీకోస్ట్ 2-0తో కురసావోను ఓడించింది. 6 పాయింట్లతో గ్రూప్-ఈ రెండో ప్లేస్ అందుకొని తొలిసారి నాకౌట్ రౌండ్‌కు అర్హత సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో ఐవరీ తరఫున నికోలస్ పెపె 7,64వ నిమిషాల్లో డబుల్ గోల్స్ చేసి హీరోగా నిలిచాడు.

ప్రపంచకప్‌లో ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించిన తుర్కియే జట్టు.. గ్రూప్-డి చివరి మ్యాచ్‌లో 3-2తో ఆతిథ్య అమెరికాపై సంచలన విజయం సాధించింది. సోఫి స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠపోరులో 3వ నిమిషంలోనే అమెరికా ఆటగాడు ఆస్టన్ ట్రస్టీ హెడర్ ద్వారా తొలి గోల్ సాధించగా, తుర్కియే యంగ్ స్టర్ అర్దా గులెర్ (10వ ని) గోల్ కొట్టాడు. ఆ తర్వాత 31వ నిమిషంలో ఒర్కున్ కొక్చు మరో గోల్ సాధించి జట్టుకు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. 49వ నిమిషంలో అమెరికా ప్లేయర్ సెబాస్టియన్ బెర్హాల్టర్ 20 గజాల దూరం నుంచి పవర్ఫుల్ స్ట్రైక్‌తో స్కోరును 2-2తో సమం చేశాడు. కానీ, ఇంజూరీ టైమ్ 8వ నిమిషంలో కాన్ అయాన్ కొట్టిన మెరుపు గోల్ తుర్కియేకు ఈ ప్రపంచకప్‌లో మొదటి విజయాన్ని అందించింది.ఇదే గ్రూప్‌లో ఆస్ట్రేలియా, పరాగ్వే మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది.
గ్రూప్-ఎఫ్ లో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3-1తో ట్యునీషియాపై ఘన విజయం సాధించింది. గ్రూప్ విజేతగా నాకౌట్ రౌండ్‌కు దూసుకెళ్లింది. మూడో నిమిషంలోనే ట్యునీషియా ప్లేయర్ ఎలీస్ స్కిరి ఓన్ గోల్ చేసి డచ్ జట్టు విజయానికి మార్గం సులువు చేశాడు. బ్రియాన్ బ్రాబీ ఏడో నిమిషంలో డచ్ టీమ్‌కు గోల్ అందించాడు. 62వ నిమిషంలో జాన్ పాల్ హెకే మరో గోల్ అందించి నెదర్లాండ్స్ విజయంలో భాగమయ్యాడు. ఇదే గ్రూప్‌లో జపాన్, స్వీడన్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా అవ్వగా.. రెండు జట్లూ నాకౌట్ రౌండ్‌కు అర్హత సాధించాయి. మ్యాచ్ 56వ నిమిషంలో జపాన్ ఫార్వర్డ్ మయెదా గోల్ కొట్టగా.. స్వీడన్ ప్లేయర్ ఎలాంగా (62వ ని) స్కోరు సమం చేశాడు.
న్యూజిలాండ్ x బెల్జియం
ఉ. 8.30 నుంచి
ఈజిప్ట్ x ఇరాన్
ఉ. 8.30 నుంచి
పనామా x ఇంగ్లండ్
అ.రా. 2.30 నుంచి
క్రొయేషియా x ఘనా
అ.రా. 2.30 నుంచి