హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీవోఏ)లో వర్గపోరు మరింత ముదిరింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వర్సెస్ టీవోఏ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి వర్గాలుగా సాగుతున్న పోరులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆదివారం మహేశ్ గౌడ్ వర్గం.. 2025-29 కాలానికి గాను కొత్త ఆఫీస్ బేరర్ల ఎన్నికలను నిర్వహించింది. భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) నుంచి అబ్జర్వర్లు లేకుండానే ఈ ఎన్నిక జరుగడం గమనార్హం. ఈ ఎన్నికలలో అధ్యక్షుడిగా ప్రేమ్‌రాజ్, ఉపాధ్యక్షుడిగా కొమురయ్య ఎన్నికయ్యారు. గత నెలలో ఎన్నికైన టీవోఏ కార్యవర్గానికి ఐవోఏ గుర్తింపు దక్కకపోగా తాజాగా టీపీసీసీ చీఫ్ వర్గం ఎన్నికలను నిర్వహించుకోవడం చర్చనీయాంశమైంది.