ముంబై: ఐపీఎల్లో ప్లేయర్లపై జరిమానాల పర్వం కొనసాగుతూనే ఉన్నది. సుదీర్ఘంగా సాగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ పోరులో టిమ్ డేవిడ్‌తో పాటు హార్దిక్ పాండ్యాపై జరిమానా పడింది. ముంబైతో మ్యాచ్ సందర్భంగా ఫీల్డ్ అంపైర్లతో అనుచితంగా వ్యవహరించిన కారణంగా టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియామళిని అనుసరించి లెవల్-1 తప్పిదం కింద డేవిడ్‌పై చర్యలు తీసుకున్నట్లు ఐపీల్ ఒక ప్రకటనలో పేర్కొంది.
మ్యాచ్ సందర్భంగా ఫీల్డ్ అంపైర్లతో బంతి మార్పు విషయంపై డేవిడ్ అమర్యాదగా వ్యవహరించడాన్ని నిర్వాహకులు సిరీయస్‌గా తీసుకున్నారు. మరోవైపు స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యా మ్యాచ్ ఫీజులో రూ.12 లక్షల జరిమానా వేశారు. నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ వేసిన కారణంగా ఫైన్ వేసినట్లు ఐపీఎల్ పేర్కొంది. ఇదిలా ఉంటే ఆర్సీబీ ఇన్నింగ్స్ పూర్తి కావడానికి రెండు గంటల రెండు నిమిషాలు పడితే ముంబైకి రెండు గంటల నాలుగు నిమిషాల సమయం పట్టింది.