హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ హుసేన్సాగర్ వేదికగా సోమవారం 16వ మాన్సూన్ రెగెట్టా చాంపియన్‌షిప్ ఉత్సాహంగా మొదలైంది. మొత్తం ఏడు విభాగాల్లో 127 మంది సెయిలర్లు పోటీపడుతున్నారు. పోటీల తొలి రోజు తెలంగాణ సెయిలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. అండర్-19 మిక్స్డ్ డబుల్ క్లాస్ విభాగంలో తనూజా కామేశ్వర్-శ్రవణ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. మొదటి మూడు రేసులను గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచారు. ఇదే విభాగంలో రాష్ర్టానికి చెందిన కొమురవెల్లి దీక్షిత, గణేశ్ పీర్కట్ల రెండో స్థానం దక్కించుకున్నారు. సబ్‌జూనియర్ విభాగంలో స్థానిక సెయిలర్ మహమ్మద్ రిజ్వాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఆకట్టుకోగా, తమిళనాడుకు చెందిన కృష్ణకు రెండో స్థానం దక్కింది.
బాలికల కేటగిరీలో లాహిరి కొమురవెల్లి..తమిళనాడు సెయిలర్ శ్రేయ కృష్ణకు గట్టిపోటీనిచ్చింది. తొలి రెండు రేసుల్లో చివరి వరకు ఆధిక్యం కనబర్చినప్పటికీ లాహిరి కొద్ది తేడాతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. మలేషియాలో జరిగే లాంగ్కావి యూత్ ఇంటర్నేషనల్ టోర్నీలో లాహిరి పోటీపడనుంది. మరోవైపు అండర్-19 జూనియర్స్ 29ఈఆర్ స్కిఫ్ క్లాస్‌లో గోవాకు చెందిన నేవీ యూత్ టీమ్ సెయిలర్లు కార్తీక్, హృదయ్ రెండు రేసులు గెలిచి ఆధిపత్యం చెలాయించారు. బాలుర అండర్-19 లేజర్ ఫ్లీట్‌లో ఎన్వైఎస్సీకి గోవాకే చెందిన శరణ్యయాదవ్ మూడు రేసులు గెలిచి టాప్ దక్కించుకుంది.