India Open : ఇండియా ఓపెన్‌లో టాప్సీడ్లకు షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన కున్లవుత్ వితిద్సర్న్, మహిళల సింగిల్స్‌లో అన్ సే యంగ్ (దక్షిణ కొరియా) విజేతగా నిలిచారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఫైనల్లో ఎనిమిదో సీడ్ వితిద్సర్న్ ఫైనల్లో నంబర్ వన్ ప్లేయర్ విక్టోర్ అక్సెల్సేన్ (డెన్మార్క్)కు షాకిచ్చాడు. 22-20, 10-21, 21-12తో చిత్తు చేశాడు. అతను విక్టోర్పై గెలుపొంది సంచలనం సృష్టించాడు. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఆడిన ఆరు సింగిల్స్ మ్యాచుల్లో వితిద్సర్న్, విక్టోర్ చేతిలో పరాజయం చెందాడు. వరల్డ్ నంబర్ 1 విక్టోర్ 2021 మేలో చివరగా సింగిల్స్ ఫైనల్లో ఓడిపోయాడు.
ప్రతీకారం తీర్చుకున్న యంగ్
మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో రెండో ర్యాంకర్ అయిన యంగ్ 15-21, 21-16, 21-12తో టాప్ సీడ్ అకనే యమగుచీ(జపాన్)ని ఓడించింది. మలేషియన్ ఓపెన్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. వారం క్రితం జరిగిన ఫైనల్లో యమగుజీ, యంగ్‌పై గెలిచి ట్రోఫీ దక్కించుకుంది.