కోల్‌కతా: పన్నెండేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెస్టిండీస్ టెస్టు జట్టు భారత్‌లో పర్యటించనుంది. రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు గాను విండీస్.. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌కు రానుంది. అక్టోబర్ 2న మొహాలీలో తొలి టెస్టు, 10 నుంచి కోల్‌కతాలో రెండో టెస్టు జరుగుతుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కెరీర్లో ఆడిన చివరి టెస్టు (2013-14లో) తర్వాత కరీబియన్ జట్టు భారత్‌లో పర్యటించనుండటం ఇదే ప్రథమం. విండీస్ జట్టు పలుమార్లు భారత పర్యటనకు వచ్చినా పరిమిత ఓవర్ల సిరీస్‌లు మాత్రమే ఆడింది.
సఫారీలతో మూడు సిరీస్‌లు
వెస్టిండీస్ పర్యటన ముగిసిన వెంటనే భారత జట్టుతో దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్ల సిరీస్‌కు ఆతిథ్యమివ్వనుంది. నవంబర్ నుంచి మొదలుకాబోయే ఈ పర్యటనలో సౌతాఫ్రికా.. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వచ్చే ఏడాది జరుగబోయే టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఇరు జట్లకూ ఇది సన్నాహకంగా మారనుంది. ఢిల్లీలో మొదటి టెస్టు జరగనుండగా ఈశాన్య రాష్ట్రమైన అసోంలోని గువాహటి స్టేడియం రెండో టెస్టుకు ఆతిథ్యమివ్వనుంది. గువాహటిలో ఇదే తొలి టెస్టు కావడం విశేషం. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 03 మధ్య మూడు వన్డేలు.. డిసెంబర్ 09 నుంచి 19 దాకా ఐదు టీ20లు జరుగుతాయని బీసీసీఐ తెలిపింది.
వైజాగ్‌లో మహిళల ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్
ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి భారత్ ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్‌నకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే వెల్లడవనుంది. విశాఖపట్నంలో ఈ మెగా టోర్నీ ప్రారంభ మ్యాచ్ ఉండనున్నట్టు రాజీవ్ శుక్లా తెలిపారు. ముల్లాన్‌పూర్, తిరువనంతపురం, ఇండోర్‌లో ఇతర మ్యాచ్‌లు జరుగనున్నాయి.