PKL | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. శుక్రవారం స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో టైటాన్స్ 37-29 తేడాతో బెంగళూరు బుల్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తమదైన జోరు కనబరిచిన టైటాన్స్..బెంగళూరుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
కెప్టెన్ పవన్ సెహ్రావత్(13 పాయింట్లు) రైడింగ్‌లో సూపర్-10తో విజృంభిస్తే..డిఫెండర్ క్రిషన్ ధుల్(6)రాణించడంతో టైటాన్స్ గెలుపు సులువైంది. ఈ మ్యాచ్‌లో పవన్ పీకేఎల్‌లో 1200 రైడ్ పాయింట్ల మైలురాయిని అందుకోవడం విశేషం. మరోవైపు బెంగళూరు జట్టులో సురీందర్ దహల్(5), జతిన్(4) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇదిలా ఉంటే మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 36-28తో యు ముంబాపై గెలిచింది. అషు మాలిక్(10) ఢిల్లీ విజయంలో కీలకంగా వ్యవహరించాడు.