వైజాగ్: ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా రెండు పరాభవాల తర్వాత టైటాన్స్ 37-32తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించి టైటిల్ వేటను మొదలుపెట్టింది. గురువారం నాటి పోరులో టైటాన్స్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ పాయింట్లు సాధించింది. టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్, భరత్ తలా 8 పాయింట్లతో విజృంభించగా రైడర్ చేతన్ సాహు 5 పాయింట్లతో రాణించాడు.
ఫస్టాఫ్‌లో 9-16తో వెనుకబడ్డ జైపూర్.. రెండో అర్ధభాగంలో పుంజుకుంది. ఆ జట్టు రైడర్ నితిన్ కుమార్ 13 పాయింట్లతో రాణించినా మిగిలిన ఆటగాళ్ల నుంచి సహకారం కొరవడటంతో పింక్ పాంథర్స్‌కు ఓటమి తప్పలేదు.