PKL | నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ టాప్ లేపింది. లీగ్‌లో వరుస విజయాలతో దూసుకెళుతున్న టైటాన్స్ ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తున్నది. గురువారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 31-29తో బెంగాల్ వారియర్స్‌పై అద్భుత విజయం సాధించింది. దీంతో 42 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. టైటాన్స్ తరఫున రైడర్ విజయ్ మాలిక్ 14 పాయింట్లతో అదరగొట్టాడు.
మ్యాచ్‌లో తొలుత బెంగాల్ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ.. ఆ తర్వాత టైటాన్స్ పుంజుకుని పోటీలోకి వచ్చింది. ఓవైపు విజయ్ మాలిక్ దూకుడైన రైడింగ్‌కు తోడు పటిష్ఠమైన డిఫెన్స్‌తో వారియర్స్‌ను కట్టిపడేసింది. దీంతో ప్రథమార్ధం ముగిసే సరికి టైటాన్స్ 19-9తో ఆధిక్యంలో నిలిచింది. కీలకమైన ద్వితీయార్ధంలోనూ టైటాన్స్ అదే జోరు కనబరిచింది. బెంగాల్ తరఫున ప్రణయ్ రానె(9), హేమ్రాజ్(4), విశ్వాస్(4) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు.