నన్జింగ్ (చైనా): ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సరికొత్త చరిత్ర సృష్టించింది. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల కాంపౌండ్ విభాగంలో పతకం గెలిచిన తొలి మహిళా ఆర్చర్‌గా రికార్డులకెక్కింది. కాంస్య పోరులో జ్యోతి.. 150-145తో ప్రపంచ రెండో ర్యాంకర్ ఎల్లా గిబ్సన్ (బ్రిటన్)ను చిత్తుచేసి పతకం గెలుచుకుంది.
కాంస్య పోరులో జ్యోతి 15కు 15 సార్లు 10 పాయింట్లు సాధించి పతకాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు క్వార్టర్స్‌లో 143-140తో అలెక్సిస్ (యూఎస్ఏ) ను ఓడించి సెమీస్ చేరగా ఆ పోరులో 143-145తో ప్రపంచ మొదటి ర్యాంకర్ ఆండ్రియా బెకెర్ర (మెక్సికో) చేతిలో ఓడటంతో కాంస్య పోరులో తలపడాల్సి వచ్చింది. కాగా ఇదే క్యాటగిరీ పురుషుల విభాగంలో రిషభ్ యాదవ్ తృటిలో పతకాన్ని కోల్పోయి 4వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.