హనుమకొండ చౌరస్తా, జనవరి 10: జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో 34వ జాతీయ సీనియర్ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు బోణీ కొట్టింది. శనివారం జరిగిన మహిళల డబుల్ ఈవెంట్లో తెలంగాణ 2-0తో ఢిల్లీపై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తమదైన దూకుడు కనబరిచిన రాష్ట్ర జట్టు సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. ప్రత్యర్థి ఢిల్లీకి ఎక్కడా అవకాశమివ్వని మనోళ్లు కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. మిగతా మ్యాచ్‌ల్లో ఆలిండియా పోలీస్ 2-1తో కేరళపై, తెలంగాణపై ఆలిండియా 2-0తో గెలిచాయి. పోటీల రెండో రోజు మహిళల, పురుషుల టీమ్ ఈవెంట్ సెమీఫైనల్స్, ఫైనల్స్ జరిగాయి.
ఇందులో మహిళల టీమ్ ఈవెంట్ తుదిపోరులో ఎస్ఎస్బీ 2-0తో నాగాలాండ్‌పై గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. అంతకుముందు సెమీస్‌లో ఎస్ఎస్బీ 2-1తో మణిపూర్‌పై, నాగాలాండ్ 2-1తో యూపీపై గెలిచాయి. పురుషుల టీమ్ టైటిల్ పోరులో మణిపూర్ 2-0తో ఢిల్లీపై గెలిచింది. తొలుత సెమీఫైనల్స్‌లో మణిపూర్ 2-1తో ఎస్ఎస్బీపై, ఢిల్లీ 2-1తో అసోంపై విజయాలు సాధించాయి.
ఈ సందర్భంగా పోటలను రాష్ట్ర సెపక్తక్రా అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్‌కుమార్, సెపక్తక్రా అసోసియేషన్ చైర్మన్ హనుమాండ్లరెడ్డి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్, కోశాధికారి వికేశ్కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులు జగన్నాథస్వామి, శ్రీధర్, సంజీవరెడ్డి, అనిత, అసోసియేట్ వైస్‌ప్రెసిడెంట్స్ విజయరాజ్, సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీలు జితేందర్‌నాథ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ధన్‌రాజ్ పర్యవేక్షించారు.