జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్న వెయిట్‌లిఫ్టర్
ధనావత్ గణేశ్.. కేరాఫ్ నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామం. ఊహ తెలియని వయసులోనే కన్నతండ్రిని కోల్పోయాడు. తల్లి సైదమ్మ పెంపకంలో పెద్దవాడయ్యాడు. తండ్రి లేని లోటును ఏమాత్రం కనిపించకుండా రెక్కలు ముక్కలు చేసుకుని గణేశ్‌ను అల్లారుముద్దుగా పెంచింది. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో స్వీపర్‌గా పనిచేస్తున్న సైదమ్మ.. అక్కడే తన కొడుకును తీర్చిదిద్దింది. ఓవైపు కష్టాలకు ఎదురొడ్డుతూ గణేశ్ కెరీర్‌కు ఆయువుపట్టుగా నిలిచింది. అమ్మ ఇచ్చిన తోడ్పాటుతో అటు చదువుతో పాటు ఆటలను అమితంగా ఇష్టపడ్డ గణేశ్ చిన్నవయసులోనే జిమ్నాస్టిక్స్ వైపు ఆకర్షితుడయ్యాడు. స్పోర్ట్స్ స్కూల్ కోచ్ మాణిక్యాలరావు సూచనతో జిమ్నాస్టిక్స్ నుంచి వెయిట్లిఫ్టింగ్కు మారాడు. ఇక్కడే అతని దశ తిరిగింది. శారీరకంగా ధృడంగా ఉండే ఈ నల్లగొండ కుర్రాడు లిఫ్టింగ్‌లో ఒక్కో మెట్టు ఎదుగుతూ ప్రస్తుతం జాతీయస్థాయిలో పతకాలు కొల్లగొడుతున్నాడు. ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో మెరిసిన గణేశ్…తాజాగా ముగిసిన జాతీయ యూత్, జూనియర్ టోర్నీలో కాంస్య పతకంతో ఆకట్టుకున్నాడు. వరుస టోర్నీల్లో పతకాలతో సత్తాచాటిన ఈ యువ లిఫ్టర్ ఆసియా, కామన్వెల్త్ లాంటి మెగాటోర్నీల్లో రాణించడమే తన ఏకైక లక్ష్యమని పేర్కొన్నాడు.
జాతీయస్థాయి టోర్నీల్లో పతకాలపై స్పందన?
కరోనా వైరస్ విజృంభణతో పలు టోర్నీలు రద్దు, వాయిదా పడటం వలన చాలా నష్టపోయాను. ఓవైపు రెగ్యులర్ ప్రాక్టీస్ కోల్పోవడంతో పాటు టోర్నీలు రద్దు కావడం ఒకింత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అయినా ఎక్కడ వెనుకకు తగ్గకుండా శ్రమించాను. అందుకు తగిన ఫలితం ఇప్పుడు దక్కింది. ఒక నెలలో రెండు జాతీయస్థాయి టోర్నీల్లో సత్తాచాటాను. చండీగఢ్‌లో జరిగిన ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాను. 81 కిలోల విభాగంలో బరిలోకి దిగిన నేను స్నాచ్‌లో 123కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 158కిలోల బరువు ఎత్తాను. అదే జోరులో తాజాగా భువనేశ్వర్‌లో ముగిసిన జాతీయ యూత్, జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం ఖాతాలో వేసుకున్నాను. స్నాచ్‌లో 123కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 153కిలోలు, ఓవరాల్‌గా 256 కిలోలతో మూడో స్థానంలో నిలిచాను. వరుసగా రెండు టోర్నీల్లో పతకాలు సాధించడం చాలా సంతోషంగా ఉంది.
తదుపరి లక్ష్యమేంటి?
బెంగళూరు వేదికగా త్వరలో జరిగే ఖేలోఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో సత్తాచాటాలని చూస్తున్నాను. గత రెండు టోర్నీల మాదిరిగానే పోటీ ఎక్కువగానే ఉంటుంది. అందుకు తగ్గట్లు మరింత ప్రాక్టీస్ చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళుతాను. కోచ్ మాణిక్యాలరావు శిక్షణలో మరింత రాటుదేలాలనుకుంటున్నాను. గత ఐదేండ్లుగా ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటున్నాను. సార్ మార్గదర్శకత్వంలో భవిష్యత్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలని చూస్తున్నాను. జాతీయస్థాయి టోర్నీల్లో సత్తాచాటడం ద్వారా అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాలన్న పట్టుదలతో ఉన్నాను.
కుటుంబ నేపథ్యం ఏంటీ?
మాది నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం ఊరు. నేను ఐదేండ్ల వయసు ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయాను. చిన్నప్పటి నుంచి తల్లి సైదమ్మ మమ్మల్ని కష్టపడి పెంచింది. పేద కుటుంబానికి చెందిన తాము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో స్వీపర్‌గా చేస్తూ మా అమ్మ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. ఆమె పడ్డ కష్టానికి మేము ప్రయోజకులం కావడం సంతోషంగా ఉంది. నా లాగే మా అన్న ధనావత్ భానుకుమార్ రోయింగ్‌లో సత్తాచాటుతున్నాడు. ఇలా ఒకే కుటుంబం నుంచి రాష్ట్రం తరఫున రాణించడం గర్వంగా ఉంది. ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న నేను వెయిట్‌లిఫ్టింగ్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనుకుంటున్నాను.
గోల్డ్‌కోస్ట్(2018) కామన్వెల్త్ గేమ్స్ పసిడి పతక విజేత అయిన నా శిష్యుడు రాగాల వెంకటరాహుల్ తరహాలో గణేశ్‌ను తీర్చిదిద్దుతాను. జాతీయస్థాయి జూనియర్ టోర్నీల్లో గణేశ్ నిలకడగా రాణిస్తున్నాడు. భవిష్యత్‌లో అతడు మరిన్ని పతకాలు సాధిస్తాడన్న నమ్మకం నాకుంది. -కోచ్ మాణిక్యాలరావు