హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్న 7వ ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్-2025కి తెలంగాణ జైళ్లశాఖ ఆతిథ్యం ఇస్తున్నట్లు డీజీ సౌమ్యా మిశ్రా పేర్కొన్నారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్ఐసీఏ)లో గేమ్స్‌కు సంబంధించిన లోగో, పోస్టర్ ఆవిష్కరించి, ఈవెంట్‌కు సంబంధించిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆమె ఆవిష్కరించారు.
అనంతరం జైలు అధికారులు, రిటైర్డ్ సీనియర్ అధికారులు, కోచ్‌లు, రిఫరీలు సహా అన్ని వరింగ్ కమిటీ సభ్యులతో ఆమె సమావేశమయ్యారు. ప్రత్యేక వెబ్సైట్ ద్వారా, గేమ్స్‌లో పాల్గొనే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ పోటీదారుల వివరాలతో నమోదు చేసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా 1200 మందికి పైగా పాల్గొననున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐజీలు రాజేష్, మురళీ బాబు, డీఐజీలు డాక్టర్ శ్రీనివాస్, సంపత్ పాల్గొన్నారు.