హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఢిల్లీ వేదికగా జరుగుతున్న 69వ ఎస్జీఎఫ్ఐ జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు పతక జోరు కనబరిచారు. బుధవారం జరిగిన వేర్వేరు ఈవెంట్లలో స్వర్ణం సహా రెండు రజతాలు, కాంస్యం దక్కించుకున్నారు. బాలుర అండర్-19 బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో తెలంగాణ స్విమ్మర్ మైలారి సుహాస్ ప్రీతమ్ 2:06: 28 సెకన్ల టైమింగ్‌తో పసిడి పతకంతో మెరిశాడు.
ఇదే విభాగంలో అమన్(కర్ణాటక), తీర్ధు సామా(కేరళ) వరుసగా రజత, కాంస్యాలు కైవసం చేసుకున్నారు. బాలుర అండర్-19 400మీటర్ల వ్యక్తిగత మెడ్లెలో దూలిపూడి వర్షిత్ 4:40: 41సెకన్లతో రజతం ఖాతాలో వేసుకున్నాడు. బాలుర అండర్-17 50మీటర్ల బటర్‌ఫ్లై క్యాటగిరీలో ఇషాన్దాస్ (25.93సె) రజతంతో మెరువగా, గౌతమ్శశి వర్ధన్ (26.25సె) కాంస్యం సొంతం చేసుకున్నాడు.