హనుమకొండ రస్తా, ఆగస్టు 3: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(JNS)లో అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 11వ తెలంగాణ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (Athletics Championship) ఉత్సాహంగా జరిగాయి. అండర్-14, 16, 18, 20 బాయ్స్ అండ్ గర్ల్స్, మెన్ అండ్ ఉమెన్స్‌కు నిర్వహించిన ఈ పోటీల్లో 33 జిల్లాల నుంచి 1400 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. రెండురోజుల ఈ పోటీల్లో అథ్లెట్లు సింథటిక్ ట్రాక్‌పై పరుగులు తీసి ప్రతిభ కనబర్చారు. బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగారు. విజయం సాధించాలనే పట్టుదలతో చివరివరకు ఎంతో పోరాడారు. పోటీలకు ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు పాల్గొని జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజులలో వరంగల్ క్రీడారంగానికి హబ్‌గా మారుతుందన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు అందరం ప్రత్యేక దృష్టితో క్రీడాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో క్రికెట్ స్టేడియం, స్పోర్ట్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరిన వెంటనే సీఎం స్పందించిన చెప్పారు. ఈ సంవత్సరం నుంచే క్రీడా తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన చెప్పారు. ఈ ప్రభుత్వం విద్యా, వైద్యం, వ్యవసాయంతో పాటు ముఖ్యంగా క్రీడారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ అధిక నిధులు కేటాయించిందన్నారు. చరిత్రలో ఎన్నడూలేనివిధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ స్టేడియం ఏర్పాటు జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. వరంగల్ వేదికగా రాష్ర్టస్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయం, స్థానికంగా ఎలాంటి అవసరమున్నా, నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు.
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ విద్యా, వైద్యం, వ్యవసాయంతో పాటు ముఖ్యంగా క్రీడారంగంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు, ఎమ్మెల్యేలు అందరం ప్రత్యేక దృష్టితో క్రీడా అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం 5000 మీటర్ల పరుగుపందెంలో రాష్ర్టస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో గెలుపొందిన క్రీడాకారులకు వారు బహుమతులను అందజేశారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ 33 జిల్లాల నుంచి 1400 మంది అథ్లెట్లు పాల్గొన్నారని, వారికి భోజన, వసతి సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. అథ్లెట్లు ఉత్సాహంగా పాల్గొని పతకాలు సాధించేందుకు పట్టుదలతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి గుగులోతు అశోక్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పగిడాల వెంకటేశ్వర్‌రెడ్డి, బిర్లా ఓపెన్ మైండ్స్ డైరెక్టర్ నిషాంత్, కోచ్‌లు శ్రీమన్నారాయణ, నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు ఐలి చంద్రమోహన్, మంచిర్యాల సెక్రటరీ మారయ్య పాల్గొన్నారు.