హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన 1వ ఆలిండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ పోటీల్లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. పలు విభాగాల్లో 4 రజత, 5 కాంస్య పతకాలు సాధించారు. ఈనెల 2 నుంచి 6 దాకా జలంధర్‌లో కబడ్డీ, ఖో-ఖో, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్ పోటీలు జరిగాయి. ఫెన్సింగ్ టీమ్ ఈవెంట్లో ఎస్ఆర్ అర్జున్, జి.ఓంకార్‌నాథ్, కె. సతీష్ కుమార్, వై.రాఘవేంద్రలు రజత పతకం కైవసం చేసుకున్నారు. మహిళా విభాగంలో జి.స్పందన, జి.అంబికా, షేక్ ఫౌజియా కాంస్య పతకం గెలిచారు. ఫెన్సింగ్ వ్యక్తిగత ఈవెంట్లో షేక్ ఫౌజియా కాంస్యం నెగ్గగా.. జిమ్నాస్టిక్స్ వ్యక్తిగత ఈవెంట్లో బి. మౌనికా కాంస్య పతకం సాధించింది. పురుషులు 4, మహిళలు 3, వ్యక్తిగత ఈవెంట్లలో మరో రెండు పతకాలు కలిపి మొత్తంగా 9 పతకాలు సాధించారు. విజేతలను డీజీపీ జితేందర్ అభినందించి సత్కరించారు.