హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : గతనెల 27 నుంచి జూలై మొదటివారం వరకు యూఎస్‌లోని అలబామాలో జరిగిన వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్-2025లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. 3 స్వర్ణ, 1 రజతం, 6 కాంస్య పతకాలతో అదరగొట్టారు. తెలంగాణ పోలీసు స్విమ్మింగ్ క్రీడల కోచ్ పి.కృష్ణారావు (హెచ్‌సీ 2077, డీఏఆర్ వనపర్తి) 50 ఏండ్లకు పైబడిన వయసు కేటగిరీలో ఇండోర్ రోయింగ్ 2,000 మీటర్లు, 500 మీ. ఈవెంట్లలో 2 స్వర్ణ పతకాలు సాధించారు. అథ్లెటిక్స్ కోచ్ మహ్మద్ బాబా (పీసీ 708, పెద్దకొడప్గల్, కామారెడ్డి) 35 ఏండ్ల కేటగిరీలో షాట్‌పుట్, 110 మీటర్ల హర్డిల్స్‌లో 2 కాంస్య పతకాలు నెగ్గారు.
తెలంగాణ పోలీసు టైక్వాండో ఆటగాళ్లు డి.గోపాలకృష్ణయ్య (హెచ్‌సీ 3144, రాజేంద్రనగర్, సైబరాబాద్) 40+ ఏజ్ కేటగిరీలో రజతం, రికగ్నైజ్డ్ పూమ్సే, ఫ్రీసె్టైల్ పూమ్సే లో 2 కాంస్య పతకాలు సాధించారు. డి.సంజీవ్ కుమార్ (ఏఆర్పీసీ 9025, అంబర్పేట్, రాచకొండ పోలీస్ కమిషనరేట్) 30+ ఏజ్ కేటగిరీ క్యోరుగి ఈవెంట్లో 1 స్వర్ణ పతకం, రికగ్నైజ్డ్ పూమ్సే, ఫ్రీైస్టెల్ పూమ్సేలో 2 కాంస్య పతకాలు గెలుచుకున్నారు. విజేతలను తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ అభినందించారు.