యూత్ గేమ్స్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: గయా(బీహార్) వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ ప్లేయర్లు పసిడి పతకాలతో అదరగొట్టారు. పోటీలకు రెండో రోజైన మంగళవారం తెలంగాణకు స్విమ్మింగ్‌లో మూడు స్వర్ణాలు సహా సైక్లింగ్‌లో కాంస్యం దక్కింది. పురుషుల 400మీటర్ల వ్యక్తిగత మెడ్లె ఈవెంట్లో రాష్ట్ర యువ స్విమ్మర్ వర్షిత్ ధూలిపూడి 4:38:39సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. పురుషుల 100మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో మైలారి సుహాస్ప్రీతమ్ 58.73సెకన్ల టైమింగ్‌తో పసిడి దక్కించుకున్నాడు. మహిళల 100మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో సాగి శ్రీనిత్య 1:06:36 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం ఖాతాలో వేసుకుంది. 1కిలోమీటర్ ట్రాక్ సైక్లింగ్ ఈవెంట్లో సాయిచరణ్ యాదవ్(1:09:56సె) మూడో స్థానంతో కాంస్యం కైవసం చేసుకున్నాడు. మొత్తంగా నాలుగు పతకాలతో తెలంగాణ ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నది.