హనుమకొండ చౌరస్తా, మార్చి 31 : చత్తీస్‌గఢ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా గిరిజన క్రీడల్లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటారు. మంగళవారం జరిగిన రెజ్లింగ్‌తో పాటు అథ్లెటిక్స్‌లో స్వర్ణం సహా రజతం, రెండు కాంస్య పతకాలు మన ఖాతాలో చేరాయి. మహిళల రెజ్లింగ్ 57కిలోల విభాగంలో యువ రెజ్లర్ నాగలక్ష్మి పసిడి పతకంతో మెరిసింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్ పోరులో నాగలక్ష్మి 10-0 తేడాతో సాయి సిద్ది(కర్ణాటక)పై అలవోక విజయం సాధించింది.
పురుషుల గ్రీకోరోమన్ 77 కిలోల పోరులో జాదవ్ చరణ్(తెలంగాణ) 8-0తో హనీశ్కుమార్(చత్తీస్‌గఢ్)పై గెలిచి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. గ్రీకోరోమన్ 135కిలోల నార్దిక్ విభాగంలో రాజు కాంస్యం దక్కించుకున్నాడు. మరోవైపు జగ్దల్పూర్లో జరిగిన అథ్లెటిక్స్ 110మీటర్ల హార్డిల్స్‌లో దత్తు రజత పతకం సొంతం చేసుకున్నాడు ఇదిలాఉండగా గిరిజన క్రీడల రెజ్లింగ్ మహిళల విభాగంలో తెలంగాణ జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది.