HCA | హైదరాబాద్, ఏప్రిల్ 30, (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిధుల వినియోగానికి సంబంధించి పాలకవర్గంపై ఆరోపణల నేపథ్యంలో ఆర్థిక పరమైన విధాన నిర్ణయాలు తీసుకోరాదని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ డివిజన్ బెంచ్ స్టే ఆదేశాలు జారీ చేసింది. హెచ్సీఏ నిధుల దుర్వినియోగంపై దర్యాప్త జరిపించాలని సీబీఐ, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు లేవంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) దాఖలు చేసిన కేసులో సింగిల్ జడ్జి ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు తీసుకోరాదని హెచ్సీఏను ఆదేశించారు.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ హెచ్సీఏ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషన్లో లేని అంశాల జోలికి వెళ్లి సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారని పేరొంది. అప్పీల్లోని ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. విచారణను జూన్ నెలకు వాయిదా వేసింది.