హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ వార్షిక బడ్జెట్లో క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం 465 కోట్లు కేటాయించింది. బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో పలు ప్రాతిపాదనలు చేశారు. సిటీ పరిసరాల్లో ఉన్న హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని, ఫోర్త్ సిటీలో స్పోర్ట్స్ హబ్ సహా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సదుపాయాలు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో 12 క్రీడా అకాడమీలు ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ రాష్ర్టానికి మంచి పేరు తీసుకొచ్చిన మహ్మద్ సిరాజ్, నిఖత్జరీన్, దీప్తి జివాంజీ పేర్లను బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. బడ్జెట్లో సముచిత రీతిలో నిధులు కేటాయించడం పట్ల సాట్స్ సిబ్బంది, ప్లేయర్లు, కోచ్‌లు సంతోషం వ్యక్తం చేశారు. కేటాయింపులకు తగ్గట్లు క్రీడలను అభివృద్ధి చేయాలని వారు ఆకాంక్షించారు. రాష్ర్టాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి పేర్కొన్నారు.