హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణను దేశంలోనే స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని అన్నారు. క్రీడాకారులకు ఆధునిక వసతులు కల్పించడంతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా దృఢ సంక్పలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. యువ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
జనరల్ బాడీ సమావేశం సందర్భంగా 2026-2030 కాలానికి గాను తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు ఎన్నికవగా ఉపాధ్యక్షులుగా వై. ఉపేందర్ రావు, వి. చాముండీశ్వరనాథ్, జి. వెంకట్రావు, పి. రమేశ్ రెడ్డి, శ్రీనివాస్ ఉప్పల ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా పుల్లెల గోపీచంద్, ట్రెజరర్‌గా కనూరి వంశీధర్‌ను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో క్రీడల అభివృద్ధి, యువ క్రీడాకారులకు శిక్షణా వసతుల విస్తరణ, జిల్లా స్థాయి పోటీల నిర్వహణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.