అహ్మదాబాద్: సఫారీ గడ్డపై ఘోర పరాజయాల అనంతరం విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సిద్ధమైన టీమ్ఇండియా గురువారం ప్రాక్టీస్ ప్రారంభించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా తొలి పోరు జరుగనుండగా.. క్వారంటైన్ ముగించుకున్న భారత ఆటగాళ్లు ట్రైనింగ్ మొదలు పెట్టారు. కరోనా బారిన పడిన స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్, రిజర్వ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ విడివిడిగా ఐసొలేషన్‌లో ఉండగా.. వన్డే జట్టుకు ఎంపిక చేసిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మూడు రోజుల కఠిన క్వారంటైన్ అనంతరం మ్యాచ్ రోజు నేరుగా జట్టుతో కలువనున్నాడు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇషాన్ కిషన్‌ను కూడా మేనేజ్మెంట్ వన్డే జట్టులో చేర్చింది. కొవిడ్ సోకిన వారిలో నెట్ బౌలర్ నవ్‌దీప్ సైనీతో పాటు ఫీల్డింగ్ కోచ్ దిలీప్, సెక్యూరిటీ అధికారి లోకేశ్, రాజీవ్ కుమార్ ఉన్నారు. ఆదివారం వెస్టిండీస్‌తో జరుగనున్న మ్యాచ్ భారత వన్డే చరిత్రలో 1000వది కావడం విశేషం.