England-Team India | పుణెలో ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య శుక్రవారం జరిగిన నాలుగో టీ-20 మ్యాచ్లో టీం ఇండియా 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులు చేయాల్సిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హరిబ్రూక్ 26 బంతుల్లో 51 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అర్షదీప్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. ఓపెనర్లలో బెన్ డెకెట్ 39 పరుగులు, ఫిల్ సాల్ట్ 23 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ నిలవలేక పోయారు. భారత్ బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా చెరో మూడు, వరుణ్ చక్రవర్తి రెండు, అర్షదీప్ సింగ్, అక్సర్ పటేల్ చెరో వికెట్ తీశారు.
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్దేశిత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. శివం దూబే, హార్దిక్ పాండ్యా చెరో 53 పరుగులు చేశారు. రింకూ సింగ్ 30, అభిషేక్ శర్మ 29 పరుగులతో పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాఖిబ్ మహ్మద్ మూడు, జామీ ఓవర్టన్ రెండు, బ్రైడన్ కార్సె, అదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు.