దీపావళి ముగిసినా భారత క్రికెట్ అభిమానులను అలరించేందుకు గురువారం ‘డబుల్ బ్లాక్ బస్టర్ బొనాంజా’ను పట్టుకొచ్చింది. స్వదేశంలో వన్డే ప్రపంచకప్ ఆడుతున్న మహిళల జట్టుతో పాటు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పురుషుల జట్లు తమ ప్రత్యర్థులతో నేడు కీలక మ్యాచ్‌లు ఆడనున్నాయి. వరల్డ్ కప్‌లో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇక తొలి వన్డేలో ఓడటంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను నిలుపుకోవాలంటే విజృంభించాల్సిన స్థితి గిల్ సేనది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా అభిమానులకు రోజంతా క్రికెట్ మజా అందనుండటం ‘డబుల్ గ్యారెంటీ’..
అడిలైడ్: ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో ప్రారంభించిన భారత జట్టు గురువారం రెండో వన్డే ఆడనుంది. ఇరుజట్ల మధ్య అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగబోయే మ్యాచ్‌లో సిరీస్‌ను కాపాడుకోవాలంటే టీమ్ఇండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి! పెర్త్‌లో వర్షం తీవ్ర అంతరాయం కల్గించిన మ్యాచ్‌లో బ్యాటింగ్ లయ దెబ్బతిని ఆసీస్ బౌలింగ్‌కు దాసోహమైన గిల్ సేన.. రెండో మ్యాచ్‌లో అయినా పుంజుకుని మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. అడిలైడ్‌లో ఓడితే సిరీస్ కోల్పోయే ప్రమాదముంది. ఏడు నెలల తర్వాత పునరాగమనంలో రోహిత్, కోహ్లీ నిరాశపరిచినా నేటి మ్యాచ్‌లో అయినా ఆ ఇద్దరూ మెప్పిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. భారత జట్టుకు ఘనమైన రికార్డు (2008 నుంచి ఇక్కడ ఒక్క వన్డే కూడా ఓడలేదు) కల్గిన అడిలైడ్‌లో ఆ విజయాల పరంపరను మెన్ ఇన్ బ్లూ కొనసాగిస్తుందా?
నిలిస్తేనే సిరీస్ నిలిచేది..
వరుణుడు, వాతావరణ పరిస్థితులతో తొలి మ్యాచ్‌లో బ్యాట్‌తో ఘోరంగా విఫలమైన గిల్ సేన.. అడిలైడ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తేనే సిరీస్ నిలబడుతుంది. ‘రోకో’ ద్వయం రీఎంట్రీలో విఫలమవగా అడిలైడ్‌లో రాణించాలని భారత్ కోరుకుంటున్నది. బుధవారం నెట్స్‌లో రోహిత్.. గౌతం గంభీర్ పర్యవేక్షణలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఇద్దరు త్రో డౌన్ స్పెషలిస్టులతో బంతులు వేయిస్తూ హిట్‌మ్యాన్ బ్యాటింగ్‌ను గౌతీ తీక్షణంగా గమనించాడు. మరోవైపు ప్రాక్టీస్ సందర్భంగా హెడ్‌కోచ్.. యశస్వీ జైస్వాల్‌తో ఎక్కువసేపు ముచ్చటించడంతో నేటి మ్యాచ్‌లో రోహిత్‌కు బదులుగా యశస్వీని బరిలోకి దించనున్నారా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేగాక జట్టు కూర్పులో భాగంగా కుల్దీప్ యాదవ్‌కూ చోటు దక్కొచ్చన్న అంచనాల నేపథ్యంలో ఎవర్ని పక్కనబెడతారన్నదీ ఆసక్తికరంగానే మారింది. గత మ్యాచ్‌లో డకౌట్ అయిన కోహ్లీ.. అడిలైడ్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి. కోహ్లీతో పాటు కొత్త కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ క్రీజులో నిలిస్తేనే సిరీస్ ఆశలు నిలబడతాయి.
ఉత్సాహంతో ఆసీస్
తొలి వన్డేలో అలవోక విజయం సాధించిన కంగారూలు.. అడిలైడ్‌లోనూ అదే ఊపును కొనసాగించి సిరీస్‌ను ఇక్కడే పట్టేయాలని భావిస్తున్నది. స్టార్ పేసర్లు స్టార్క్, హాజిల్‌వుడ్ ద్వయం మరోసారి భారత టాపార్డర్‌ను తిప్పలు పెట్టేందుకు సిద్ధమైంది. రెగ్యులర్ ఆటగాళ్ల గైర్హాజరీలో కొత్త జట్టుతో ఆడుతున్న మార్ష్ సేన.. ఈ మ్యాచ్‌లో కున్హెమన్ స్థానంలో స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాను ఆడించనున్నది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్, గిల్ (కెప్టెన్), శ్రేయాస్, అక్షర్, రాహుల్, నితీశ్, వాషింగ్టన్, హర్షిత్, సిరాజ్, అర్ష్‌దీప్
ఆసీస్: హెడ్, మార్ష్ (కెప్టెన్), షార్ట్, రెన్షా, కేరీ, ఓవెన్, కూపర్, స్టార్క్, ఎల్లీస్, జంపా, హాజిల్‌వుడ్