ICC Champions Trophy Final | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో టీం ఇండియా ముంగిట న్యూజిలాండ్ 251 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది. నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ ఏడు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఆదివారం దుబాయ్‌లో జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో టాస్ గెలుచుకున్న న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ బ్యాటర్లలో డెరిల్ మిచెల్, మిచెల్ బ్రాస్‌వెల్, ఓపెనర్ రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ మాత్రమే పర్వాలేదనిపించారు. నాలుగు వికెట్లు పోయిన తర్వాత గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి డెరిల్ మిచెల్ నెమ్మదిగా ఆడుతూ జట్టు స్కోర్ పెంచడానికి ప్రాధాన్యం ఇచ్చారు.
ఓపెనర్ విల్ యంగ్ 15 పరుగులు చేసిన తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కావడంతో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర బౌల్డ్ కావడంతో ఓపెనర్లు ఇద్దరూ ఔటయ్యారు. వన్‌డౌన్ బ్యాటర్‌గా వచ్చిన కేన్ విలియమ్సన్ క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లోనే ఆయనకే క్యాచ్ ఇచ్చి కేన్ విలియమ్సన్ పెవిలియన్ దారి పట్టాడు. అప్పటికి కివీస్ మూడు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్ కీపర్ టామ్ లాథమ్‌ను రవీంద్ర జడేజా ఎల్బీడబ్య్లూ చేయడంతో 108 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో డెరిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ నెమ్మదిగా ఆడుతూ జట్టు స్కోర్ పెంచేందుకు ప్రయత్నించారు.
ఐదో వికెట్ భాగస్వామ్యానికి 50 పరుగులు జత చేసిన తర్వాత గ్లెన్ ఫిలిప్స్ .. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డయి పెవిలియన్ బాట పట్టాడు. గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి డెరిల్ మిచెల్ వడివడిగా ఆడుతూ దూసుకెళ్లారు. డెరిల్ మిచెల్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత దూకుడుగా స్కోర్ పెంచడానికి ప్రయత్నించాడు. షమీ బౌలింగ్‌లో కవర్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి 63 పరుగుల వద్ద డెరిల్ మిచెల్ పెవిలియన్ దారిపట్టాడు. ఫిలిప్స్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మిచెల్ బ్రేస్‌వెల్ దూకుడుగా ఆడుతూ 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ శాంత్నర్ను కోహ్లీ, కేఎల్ రాహుల్ రనౌట్ చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ ఏడు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది.