ముంబై: టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ టీమ్ఇండియా వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. బౌలర్లకు పీడకల మిగిల్చిన వాంఖడేలో బ్యాటర్లు వీరవిహారం చేసిన వేళ.. ఇంగ్లండ్‌పై భారత్‌దే పైచేయి అయింది. ఇరుజట్ల మధ్య ఇక్కడ జరిగిన రెండో సెమీస్‌లో మెన్ ఇన్ బ్లూ.. 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైస్కోరింగ్ థ్రిల్లర్‌గా సాగిన పోరులో టీమ్ఇండియా నిర్దేశించిన 254 పరుగుల రికార్డు ఛేదనలో ఇంగ్లండ్.. 20 ఓవర్లకు 246/7 వద్దే ఆగిపోయింది.
జాకబ్ బెతెల్ (48 బంతుల్లో 105, 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) వీరోచిత శతకాని తోడు విల్ జాక్స్ (20 బంతుల్లో 35, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడటంతో ఆ జట్టు గెలుపునకు చేరువగా వచ్చింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ (42 బంతుల్లో 89, 8 ఫోర్లు, 7 సిక్స్‌లు), శివమ్ దూబె (25 బంతుల్లో 43, 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 రన్స్ చేసింది. శాంసన్‌కే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
ఛేదనలో ఇంగ్లండ్ సాల్ట్ (5), బ్రూక్ (7) వికెట్లను త్వరగానే కోల్పోయినా ఆ జట్టు వెనుకడుగు వేయలేదు. యువ బ్యాటర్ బెతెల్ ధనాధన్ మెరుపులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను భయపెట్టాడు. జాక్స్‌తో కలిసి అతడు భారత బౌలర్లను ఆటాడుకున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లకు ఈ జోడీ చుక్కలు చూపించి దొరికిన బంతిని దొరికినట్టుగా బాది టీమ్ఇండియా అభిమానులను ఆందోళనకు గురిచేసింది. బట్లర్ (17 బంతుల్లో 25, 4 ఫోర్లు, 1 సిక్స్) గత మ్యాచ్‌లతో పోలిస్తే కాస్త బెటర్‌గానే ఆడినా వరుణ్ ఓవర్లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కానీ అదే ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్‌లతో పరుగుల వేట మొదలుపెట్టిన బెతెల్..
ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. బట్లర్ స్థానంలో వచ్చిన టామ్ బ్యాంటన్ (17) రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో దూకుడుగా ఆడేందుకు యత్నించినా అక్షర్ అతడికి చెక్ పెట్టాడు. కానీ అతడి నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన జాక్స్‌తో కలిసి బెతెల్ దూకుడుగా ఆడారు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తిచేసిన బెతెల్.. ఆ తర్వాత మరింత జోరు పెంచడంతో లక్ష్యం వడివడిగా కరిగిపోయింది. మరో ఎండ్‌లో జాక్స్ కూడా ధాటిగా ఆడటంతో 13 ఓవర్లకే ఇంగ్లండ్ 150 రన్స్ దాటేసింది. ఈ జోడీ బాదుడుతో ఆ జట్టు 12 రన్‌రేట్‌తో లక్ష్యం దిశగా దూసుకొచ్చింది.
లక్ష్యం దిశగా సాగుతున్న ఇంగ్లండ్‌కు అర్ష్‌దీప్ షాకిచ్చాడు. అతడి 14వ ఓవర్లో ఆఖరి బంతికి ఆఫ్‌సైడ్‌కు దూరంగా వెళ్తున్న బంతిని వేటాడిన జాక్స్.. డీప్ పాయింట్లో అక్షర్ మరో అద్భుతమైన క్యాచ్‌తో అతడి కథ ముగిసింది. మ్యాచ్‌లో ఇదే మలుపు. ఇక ఆఖరి ఐదు ఓవర్లలో ఆ జట్టు విజయానికి 69 రన్స్ అవసరమవగా 16, 18 ఓవర్లలో ఆ జట్టును కట్టడి చేసి 14 రన్స్ మాత్రమే ఇచ్చాడు. హార్ధిక్ 19వ ఓవర్లో తొలి బంతికి సిక్స్‌తో 45 బంతుల్లోనే బెతెల్ శతకం పూర్తయింది. కానీ మూడో బంతికి కరన్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద తిలక్ ఒడిసిపట్టగా ఆ ఓవర్లోనూ 9 పరుగులే వచ్చాయి. ఆరు బంతుల్లో 30 పరుగులు కావాల్సి ఉండగా దూబె ఓవర్లో తొలి బంతికి రెండు రన్స్ తీయబోయిన బెతెల్.. హార్ధిక్ సూపర్ త్రో తో రనౌట్ అవడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆర్చర్ మూడు సిక్స్‌లు కొట్టినా అవి ఆ జట్టు ఓటమి అంతరాన్ని తగ్గించాయి.
టోర్నీ ఆసాంతం దారుణంగా విఫలమవుతున్న అభిషేక్ (9) మళ్లీ తొందరపాటుతో వికెట్‌ను సమర్పించుకున్నాడు. స్పిన్‌లో విఫలమవుతున్న అతడి బలహీనతను ఆసరాగా చేసుకున్న బ్రూక్.. రెండో ఓవర్లోనే జాక్స్‌కు బంతినివ్వగా అతడు ఫలితం రాబట్టాడు. వెస్టిండీస్‌తో గత మ్యాచ్‌లో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ మరోసారి దుమ్మురేపాడు. అభిషేక్ త్వరగానే నిష్క్రమించినా.. ఇషాన్ కిషన్ అండతో అతడు రెచ్చిపోయాడు. 15 పరుగుల వద్ద బ్రూక్ క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన సంజూ.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
ముఖ్యంగా గతంలో షార్ట్‌పిచ్ బంతులతో తనను ఇబ్బందిపెట్టిన జోఫ్రా ఆర్చర్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడాడు. కిషన్, శాంసన్ ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలోనే భారత్ 67/1తో నిలిచింది. డాసన్ 8వ ఓవర్లో నాలుగో బంతిని లాంగాఫ్ మీదుగా భారీ సిక్స్‌తో 26 బంతుల్లో శాంసన్ ఈ టోర్నీలో వరుసగా రెండో ఫిఫ్టీని సాధించాడు. కరన్ వేసిన 9వ ఓవర్లోనూ ఈ జోడీ 20 రన్స్ రాబట్టింది. రెండో స్పెల్‌కు వచ్చిన రషీద్.. పదో ఓవర్లో ఇషాన్‌ను ఔట్ చేయడంతో 97 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ అయిన దూబె.. రషీద్ 12వ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లతో అలరించాడు.
ఆర్చర్ ఓవర్లో రెండు సిక్స్‌లతో శతకానికి చేరువైన శాంసన్.. జాక్ 14వ ఓవర్లో ఆఫ్‌సైడ్ ఆవలగా వెళ్తున్న బంతిని వేటాడి డీప్ కవర్స్‌లో సాల్ట్ చేతికి చిక్కి సెంచరీ చేజార్చుకున్నాడు. కెప్టెన్ సూర్య (11) నిరాశపరిచినా దూబె, హార్ధిక్ (12 బంతుల్లో 27, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుతో 17 ఓవర్లకే టీమ్ఇండియా 200 పరుగుల మార్కును దాటింది. హార్ధిక్‌తో సమన్వయం లోపించడంతో దూబె రనౌట్ అయ్యాడు. ఆఖర్లో తిలక్ వర్మ (7 బంతుల్లో 21, 3 సిక్స్‌లు) ఆర్చర్ బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు బాది నిష్క్రమించినా ఆఖరి ఓవర్లో హార్ధిక్ రెండు సిక్స్‌లతో భారత స్కోరును 250 దాటించాడు.
వాట్ ఏ సెమీఫైనల్! ఇంతకంటే గొప్ప విజయం మరొకటి ఉండదేమో. టేకే బో మెన్ ఇన్ బ్లూ అక్షర్‌పటేల్ అద్భుతమైన రెండు క్యాచ్‌లు ఈ విజయానికి కారణమేమో అని నా అభిప్రాయం టీమ్ ఇంగ్లండ్ పోరాట ప్రదర్శనకు అభినందనలు టీమ్ఇండియాకు ప్రత్యేక శుభాకాంక్షలు
-కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన సెమీస్‌లో ఉత్కంఠ విజయంతో టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అద్భుత ప్రదర్శనకు కారణమైన ప్లేయర్లకు అందుకోసం వారు పడ్డ కష్టం మరువలేనిది. చర్రితకు మరో అడుగు దూరంలో, ఫైనల్ పోరుకు ఆల్ ద బెస్ట్.
-హరీశ్‌రావు, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత
బర్మింగ్‌హామ్: ఆల్‌ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిలే లక్ష్యంగా ఆడుతున్న భారత నంబర్ వన్ షట్లర్ లక్ష్యసేన్ ఆ దిశగా మరో మందడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అతడు.. 21-19, 21-23, 21-10తో ఇంగ్ క లాంగ్ అంగస్ (హాంకాంగ్)ను ఓడించి క్వార్టర్స్ చేరాడు. హాంకాంగ్ షట్లర్‌తో ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లో ఓడిన సేన్.. గంటా 18 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో మాత్రం అతడికి షాకిచ్చాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ధృవ్ కపిల-తనీషా క్రాస్టో 19-21, 2-9తో సె యింగ్, టాంగ్ చున్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ మరో మేజర్ అంతర్జాతీయ క్రీడాటోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. ఈనెల 8 నుంచి గచ్చిబౌలి వేదికగా రాష్ట్ర క్రీడాశాఖ, సాట్స్ ఆధ్వర్యంలో ఎఫ్ఐహెచ్ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్స్ టోర్నీ మొదలుకానుంది. ఆతిథ్య భారత్ సహా ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ బరిలో ఉన్నాయి. మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడననున్నాయి.
ఇందుకు సంబంధించి గురువారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా భేటీలో క్రీడా మంత్రి శ్రీహరి, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీబాలదేవి పాల్గొన్నారు. టోర్నీ కోసం ఇప్పటికే జట్లన్నీ నగరానికి చేరుకున్నాయని, అన్ని రకాల ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్కొన్నారు. రూ.18 కోట్లతో నిర్వహిస్తున్న టోర్నీలో అంతర్జాతీయ ప్రమాణాలతో అస్ట్రోటర్ఫ్ మైదానాన్ని అభివృద్ధి చేశామని అన్నారు.
ఢిల్లీ: పొట్టి ప్రపంచకప్ ఆడేందుకు వచ్చి పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో భారత్‌లోనే నిలిచిపోయిన జింబాబ్వే క్రికెట్ జట్టు స్వదేశానికి వెళ్లింది. ఇరాన్ దాడులతో పశ్చిమాసియా వ్యాప్తంగా గగనతలాలు మూసేయడంతో ఢిల్లీలోనే ఆగిపోయిన ఆ జట్టును తాజాగా ఐసీసీ.. బుధవారం ప్రత్యేక ఏర్పాట్లు చేసి సొంతదేశానికి పంపింది. దుబాయ్ నుంచి కాకుండా ఇథియోఫియా మీదుగా జింబాబ్వే తొలి బ్యాచ్ జట్టును ఆ దేశానికి పంపినట్టు జింబాబ్వే క్రికెట్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా కోల్‌కతాలో నిలిచిపోయిన వెస్టిండీస్ జట్టు కోసం మరో రెండు రోజుల్లో స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్‌ను ఏర్పాటుచేయనున్నట్టు తెలుస్తున్నది.