Ind vs Aus | మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి వన్డేలో టీమ్ఇండియా (Ind vs Aus) పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టాపార్డర్ కుప్పకూలడంతో 8.1 ఓవర్లలో 25 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. ఏడు నెలల తర్వాత వన్డే మ్యాచ్ ఆడుతున్న సీనియర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశ పరిచారు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ అడుతున్న శుభ్‌మన్ గిల్ కూడా తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్‌ను తమ పదునైన బంతులతో ఆసీస్ బౌలర్లు ఇబ్బందులకు గురిచేశారు. బౌన్స్, లైన్ అండ్ లెంగ్త్‌తో కట్టుదిట్టంగా బంతులు విసిరిన ఆస్ట్రేలియా బౌలర్లు భారత ఓపెనర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. కెరీర్లో 500 వన్డే ఆడుతున్న హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఫోర్ కొట్టి మంచి ఊపులో ఉన్నట్లు కనిపించాడు. అయితే 4వ ఓవర్లో జోష్ హేజిల్‌వుడ్ వేసిన షార్ట్ డెలివరీకి దొరికిపోయాడు. రోహిత్ (8) బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా వెళ్లి స్లిప్‌లో ఉన్న రెన్షా చేతిలో పడింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఖాతా తెరవకుండానే వెనుతిరిగాడు. స్టార్క్ వేసిన 6వ ఓవర్ తొలి బంతిని డ్రైవ్ షాట్ ఆడిన కోహ్లీ కూపర్ చేతికి చిక్కాడు. దీంతో ఆస్ట్రేలియాపై కోహ్లీ మొదటిసారిగా డకౌట్ అయినట్లయింది.
ఆ తర్వాత కెప్టెన్ గిల్ (10) కూడా ఔట్ అవడంతో జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ఇన్నింగ్స్ 8.1వ ఓవర్లో నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 8 ఓవర్లలో 25 రన్స్ చేసిన భారత్ 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ (2), అక్షర్ పటేల్ (0) క్రీజులో ఉన్నారు. అయితే వరణుడు అడ్డు తగలడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు.